ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జెల వెంకట లక్ష్మి పదవీ కాలం ముగిసింది. ఆమె పదవీ కాలం ముగిసినట్లు ప్రభుత్వం మెమో జారీ చేసింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఈ మెమో జారీ చేశారు. అయితే మంగళవారమే ( 23-09-24) ఈ మెమో జారీ చేశారు. అయితే గజ్జెల లక్ష్మి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ఉదయం ప్రకటించారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవీ కాలం ముగియటంతో మిగతా బోర్డు సభ్యుల పదవీకాలం కూడా ముగిసినట్టేనని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు 2019 ఎన్నికల్లో విజయం సాధించి ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. 2019 ఆగస్ట్ 26వ తేదీన ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మను నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ నియామకం ప్రకారం వాసిరెడ్డి పద్మ.. ఐదేళ్ల పాటు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవిలో ఉండేందుకు వీలుంది. 2024 ఆగస్ట్ 25 వరకూ ఆమె పదవిలో కొనసాగేందుకు అవకాశం ఉండేది. అయితే 2024 మార్చిలో ఏపీ ప్రభుత్వం వాసిరెడ్డి పద్మను ఆ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి నుంచి తప్పించింది. వాసిరెడ్డి పద్మ తన పదవికి 2024 మార్చి 4వ తేదీ రాజీనామా చేశారు. ఆమె స్థానంలో గజ్జెల వెంకట లక్ష్మి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. దీనికి సంబధించి మార్చి 15న ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
అయితే మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవీకాలం ఆగస్ట్ 25వ తేదీతోనే ముగిసింది. ఈ నేపథ్యంలో గజ్జెల లక్ష్మి పదవీకాలం ముగిసినట్లు ప్రభుత్వం మెమో జారీ చేసింది. అయితే గజ్జెల లక్ష్మి మాత్రం తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మరోవైపు ముంబై నటి వ్యవహారంలో గజ్జెల లక్ష్మి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె ముంబైకి చెందిన వ్యక్తి కావటంతో మహారాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించాలంటూ గజ్జల వెంకటలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు.