ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలు హిందూ సనాతన ధర్మం ఏమిటో పవన్‌కు తెలుసా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 10:11 PM

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న‌ది ప్రాయ‌శ్చిత దీక్ష కాద‌ని, అది రాజ‌కీయ దీక్ష అని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు పోతిన వెంకట మహేష్ అభివ‌ర్ణించారు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి. అంతేగానీ విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మహేష్‌ చురకలు అంటించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారి లడ్డూ మీద కూటమి ప్రభుత్వం పని గట్టుకుని దాడి చేస్తోందని, హిందూ సనాతన ధర్మంపై కూటమి పెద్దలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని పోతిన వెంకట మహేష్‌ ఆక్షేపించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ హిందూ ధర్మంపై మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోందన్న ఆయన, అసలు హిందూ సనాతన ధర్మం ఏమిటో పవన్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. అసలు పవన్‌ ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. పవన్‌ సిద్దాంతం, విధానం ఏమిటన్న ఆయన, ఆయనకు ఏ ఒక్క విషయంపై అయినా క్లారిటీ ఉందా? అని అన్నారు.


టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్లపై ఈఓ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ మాటలు వేర్వేరుగా ఉన్నాయని వైయస్ఆర్‌సీపీ నేత గుర్తు చేశారు. ఇప్పుడు ఆ రాద్దాంతాన్ని మరింత తీవ్రం చేసేలా డిప్యూటీ సీఎం వ్యవహరిస్తున్నారని, ప్రాయశ్చిత్త దీక్ష, ఆలయాల సంప్రోక్షణ, హిందూ సనాతన ధర్మం అంటూ హంగామా చేస్తున్నారని చెప్పారు. నిజానికి పవన్‌ ఒకసారి బాప్టిటమ్‌ తీసుకున్నానని చెప్పారని, మరోసారి తన తండ్రి పక్కా నాస్తికుడని అన్నారని, ఆకలితో అలమటించడం కంటే గొడ్డు మాంసమైనా తినొచ్చని చెప్పారని, ఇంకోసారి తన పిల్లలు ఆర్థోడాక్స్‌ క్రిష్టియన్స్‌ అన్నారని గుర్తు చేసిన పోతిన మహేష్‌.. అసలు పవన్‌ ఏ మతాన్ని ఆచరిస్తున్నారో చెప్పాలని కోరారు. మత విశ్వాసాలను అడ్డు పెట్టుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్‌ బహుముఖాలతో వ్యవహరిస్తున్నారని పోతిన మహేష్‌ ఆక్షేపించారు.పవన్‌ గతంలో ఒకసారి ప్రజారాజ్యం కోసం ప్రాణత్యాగమన్నారు. తర్వాత చంద్రబాబు కోసం త్యాగం అన్నారు. తర్వాత చంద్రబాబును దింపడానికి అన్నారు. ఇంకా కొన్నిసార్లు తనకు తాను తరిమెల నాగిరెడ్డి అంటారు. గుంటూరు శేషేంద్రశర్మ అంటారని గుర్తు చేసిన వైయస్ఆర్‌సీపీ నేత.. పవన్‌ వైఖరి ఏమిటి? ఆయన ఏ విధానం ఫాలో అవుతారు?. ఎవరి కోసం, దేని కోసం పని చేస్తారో చెప్పాలని కోరారు.


పవన్‌ తన ప్రాయశ్చిత్త దీక్షను స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి, వరదల్లో ప్రజలకు అండగా నిలవనందుకు, తన శిష్యుడు జానీ మాస్టర్‌ మైనర్‌ బాలికను రేప్‌ చేసినందుకు, కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయానికి నిరసనగా, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి వందలాది ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం జరిగినందుకు, అతిసారం వల్ల ఇబ్బందులు పడుతున్న వారి కోసం, పోలీసుల మీద మహిళలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నందుకు చేయాలి కానీ.. నిరాధార నింద మోపి దుష్ప్రచారం చేస్తున్న సున్నితమైన అంశాలపై కాదని స్పష్టం చేశారు.


ఇంకా దళిత ప్రొఫెసర్‌ను దారుణంగా అవమానించిన తన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యవహారం, వరదలు విజయవాడను ముంచెత్తినా పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌ క్యాంప్‌ ఆఫీస్‌ కోసం రూ.30 లక్షల ఫర్నీచర్‌ కొనుగోలు చేసి, వాటన్నింటినీ ఇంటికి పట్టుకుపోయిన వ్యవహారం, కాకినాడ జిల్లా కరపలో మీ పార్టీ మనిషి కాదని కాటికాపరి ఉద్యోగం తీసేయడం, మీకు ఓట్లు వేయలేదని కొన్ని ప్రాంతాల్లో మంచినీటి పైప్‌లైన్స్‌ తీసేయడం, విజయవాడ వరద బాధితులను పరామర్శించకపోవడం.. వీటన్నింటిపై పవన్‌కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే బాగుండేదని పోతిన మహేష్‌ అన్నారు. దీక్షలో ఉండి కూడా ఇష్టారాజ్యంగా రాజకీయాలు మాట్లాడడం, విమర్శలు చేయడం తగదన్న, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఆ దీక్షలోనే హరిహర వీరమల్లు సినిమాకు మంగళగిరిలో పెద్ద పరదాలు కట్టి షూటింగ్‌లో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇదేనా సనాతన హిందూ ధర్మం అని మ‌హేష్‌ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com