ఐదేళ్ల జగన్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రైతులకు చెల్లిస్తానని చెప్పిన ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో విపత్తులకు రైతులు నష్టపోయారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇవాళ(మంగళవారం) ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ... తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని వివరించారు.
ధాన్యం బకాయిలు వైసీపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో కూటమి ప్రభుత్వం రూ. 1600 కోట్ల రైతు బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. ఆధునిక టెక్నాలజీ డ్రోన్ ద్వారా పంటలకు పురుగు మందులు పిచికారీ చేసే విధానంతో మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రైతు భరోసా చెల్లిస్తున్నాయని స్పష్టం చేశారు. నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హెచ్చరించారు.తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరాజు, వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ అధికారులతో కలిసి వరి పొలాలను ఎమ్మెల్యే వెంకటరాజు పరిశీలించారు. డ్రోన్ ద్వారా పురుగుమందుల పిచికారి విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరాజు మీడియాతో మాట్లాడుతూ... సేంద్రీయ వ్యవసాయ విధానాలకు కేంద్ర బిందువుగా గోపాలపురం నియోజకవర్గం ఉందని తెలిపారు.. గోపాలపురం నియోజకవర్గంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే వెంకటరాజు వెల్లడించారు.