ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు సముచిత స్థానం కల్పించారని ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా కొనకళ్ల నారాయణరావును సీఎం చంద్రబాబు నియమించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణరావు స్పందించారు. పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని తనకు మంచి పదవి ఇచ్చారన్నారు. ఆర్టీసీ చైర్మన్ పదవి తనకు కేటాయించడం ద్వారా సీఎం చంద్రబాబు.. పార్టీలోని నేతలు, కార్యకర్తలకు ఎంత పెద్ద పీట వేస్తారో అర్థమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు... తనకు ఏ పదవి అప్పగించినా శక్తివంచన లేకుండా పని చేస్తానని కొనకళ్ల నారాయణ రావు అన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో కష్టించి పని చేసిన వారిని.. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారితోపాటు పొత్తుల్లో భాగంగా టిక్కెట్లు త్యాగం చేసిన వారిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. అందులోభాగంగా తొలి విడతగా 99 మందిని నామినేటెడ్ పోస్టులకు ఆయన ఎంపిక చేశారు. వారిని వివిధ సంస్థలకు చైర్మన్లుగా నియమించారు. ఆ క్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా కొనకళ్ల నారాయణను చంద్రబాబు నియమించారు. అయితే 2009, 2014 ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొనకళ్ల నారాయణ రావు బరిలో దిగి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అలాగే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ స్థానం టికెట్‌ను.. మిత్రపక్షమైన జనసేన పార్టీకి టీడీపీ కేటాయించింది. దీంతో జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వల్లభనేని బాలశౌరి విజయం సాధించిన సంగతి తెలిసిందే. పార్టీకి సేవే కాదు.. ఎంపీ సీటు సైతం త్యాగం చేసిన కొనకళ్లకు సముచిత స్థానం కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ క్రమంలో ఆర్టీసీ చైర్మన్ పదవిలో కొనకళ్లను నియమించారు.