ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గజ్జెల లక్ష్మికి ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆమె పదవి కాలం ఆగస్టులోనే ముగియడంతో వెంటనే తొలగించాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు సంబంధిత శాఖకు ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఈరోజు ఉదయం గజ్జెల లక్ష్మి ప్రకటించారు. ఆమెకు నిన్ననే ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. చైర్మన్‌కు ఉద్వాసన పలకడంతో సభ్యుల పదవి కాలం పూర్తి అయినట్టే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కాగా.. ముంబై నటి కాదాంబరి జెత్వాని కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ గతంలో గజ్జెల లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర రాష్ట్రాల మహిళల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, ఆమె ముంబయికి చెందిన మహిళ కాబట్టి మహరాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించాలంటూ వెంకటలక్ష్మి ఇచ్చిన ఉచిత సలహాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల మహిళల విషయంలో తాము సుమోటోగా కేసు తీసుకోలేమంటూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ చెప్పిన మాటలతో దుమారం చెలరేగింది.