త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరుగుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బోర్డు నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారన్నారు. టీటీడీ పాలకమండలితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వేల దేవాలయాల పాలకమండళ్లను త్వరలోనే నియమిస్తామని ప్రకటించారు. లడ్డు వివాదం ముగిసిన అంశం అని.. తదుపరి సిట్ దర్యాప్తు నిర్వహిస్తుందని తెలిపారు. సిట్ నివేదిక వచ్చిన తరువాత విజిలెన్స్, సిట్ నివేదికలపై ప్రభుత్వం పరిశీలన జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తిరుమల ఆలయంతో పాటు రాష్ట్రంలోని 7 ప్రధాన ఆలయాల్లో నిన్నే (సోమవారం) శాంతి హోమం, సంప్రోక్షణ కార్యాక్రమాలను నిర్వహించామన్నారు.
రాష్ట్రంలోని మిగతా ఆలయాల్లో కూడా శాంతి హోమం, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించామని అన్నారు. నాణ్యమైన ముడిసరుకులతో శ్రీవారికి ప్రసాదాలు సమర్పించాలని ఇప్పటికే సీఎం ఆదేశించారన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నెయ్యితో పాటు ముడి సరుకులను పరిశీలించి.. నాణ్యతని పరిశీలించాకే వినియోగించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించామని.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర, కన్యాకా పరమేశ్వరి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి పేర్కొన్నారు.