ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానంలో సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాన్ని దేవస్థానం చేపట్టింది. మంగళవారం నాడు సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి సన్నిధిలో చేపట్టిన సంప్రోక్షణ శాంతి హోమం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు. ఏదైనా సంపూర్ణ గ్రహణాలు, అపచారాలు, పొరపాట్లు జరిగినప్పుడు సంప్రోక్షణ కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధితో పాటు పరిసరాలను శుద్ధి చేసి.. చేసిన పాపాలకు సంప్రోక్షణ చేస్తామన్నారు. దురదృష్టం కొలది గత పాలకుల తప్పిదాలు వాటి పాప పరిహారం ఈరోజు సింహాచలం దేవస్థానంలో సంప్రోక్షణ కార్యక్రమం చేయడం చాలా బాధపడాల్సిన విషయమన్నారు. ఒక్క సింహాచలంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలలో ఈ సంప్రోక్షణ శాంతి హోమం నిర్వహించి జరిగిన అపచారాలను మన్నించమని భగవంతున్ని కోరడం జరిగిందని తెలిపారు.
హిందువులు తాము కొలిచే దేవుళ్ళు అంటే ప్రాణంతో సమానమన్నారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం రివర్స్ టెండర్ అనే మాయతో దేవాలయాలను పూర్తిగా భ్రష్టు పట్టించిందని విమర్శించారు. సింహాచలంలో 1000 కిలోల నెయ్యి సీజ్ చేసి టెస్టులకు పంపించడం జరిగిందన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన విశాఖ డైరీ నెయ్యిని కొనుగోలు చేయమని ఈవోకు చెప్పినట్లు తెలిపారు. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం తప్పిదాల వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయన్నారు. ఈ మధ్యకాలంలోనే సింహాచలంలో పవిత్రోత్సవాలు నిర్వహించి కొద్దిరోజులే అయినప్పటికీ మళ్లీ ఈ సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టడం నిజంగా బాధాకరమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.