తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలో నిజాలు నిగ్గు తేలాలని, అందుకోసం అత్యున్నతస్థాయి దర్యాప్తు అవసరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. స్వయంగా ఆరోపణ చేసిన చంద్రబాబు, తన కింద పని చేసే డీఐజీ స్దాయి అధికారితో (ప్రత్యేక దర్యాప్తు బృందం–సిట్) విచారణ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. దానిపై సిట్ దర్యాప్తు ఏ మాత్రం సరికాదన్న ఆయన, దేశ అత్యున్నత న్యాయస్థానం పరిధిలో ఆ ప్రక్రియ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న డీఐజీ.. తన నివేదికలో కరుణాకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి తప్పు చేశారని, అందువల్ల వారిని ఉరి తీయాలని చెప్పడం మినహా కొత్తగా ఏం చెబుతారని అంబటి ప్రశ్నించారు. అందుకు బదులుగా మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ చేస్తే మీకు (చంద్రబాబు) మరింత సులభంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. అంత పెద్ద ఆరోపణ చేసిన చంద్రబాబు, తన ప్రభుత్వంలో పని చేస్తున్న పోలీసు అధికారితో విచారణ జరిపిస్తానన్నప్పుడే.. తన ఆరోపణలు అసత్యమని, అందులో పస లేదని తేలిపోయిందని గుర్తు చేశారు.