సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. హామీలు నిలబెట్టుకోకుండా మంచి ప్రభుత్వం అంటూ కూటమి నేతలు ఎలా ప్రచారం చేస్తున్నారంటూ నిలదీశారు. 100 రోజుల పాలనలో వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి ‘తిరుపతి లడ్డూ’ని తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు.
మంగళవారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, డాక్టర్ ఆదిమూలపు సతీష్‌తో కలిసి ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పి ఇప్పుడు టీడీపీ నేతలు మౌనంగా ఉన్నారని ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
తిరుపతి లడ్డూ అంశంలో ఆలయ అధికారులు చెప్పిన మాటలకు, సీఎం చంద్రబాబు చెప్పే మాటలకు పొంతన లేదు. జులై 12 తేదీన ట్యాంకర్‌లు వచ్చాయని అంటున్నారు.. జులై 12న ఉన్నది సీఎం చంద్రబాబు కాదా..?. లడ్డూలో కల్తీ జరగడానికి, వైయస్ జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎస్వీ మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయంగా వైయస్ జగన్‌పై బురద చల్లడానికి సీఎం చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్ తప్పు చేయలేదు కాబట్టే.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. టీటీడీని టీడీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. దీనిపై తమ నాయకులు ప్రమాణాలు చేశారు. సుప్రీంకోర్టును ఆశ్రయించాము. మంచి ప్రభుత్వం అంటూనే చంద్రబాబు.. అమ్మ ఒడి, నిరుద్యోగ భృతి, మహిళలకు మూడు సిలిండర్లు, 15 వేల రూపాయలు ఎగ్గొట్టారు. తిరుపతి లడ్డూపై నిజ నిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.