కృష్ణా జిల్లా, ఆగిరిపల్లిలో '‘పొలం పిలుస్తోంది'’ కార్యక్రమాన్ని సమాచారశాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ఇవాళ(మంగళవారం) ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో నష్టపోయిన రైతులతో మాట్లాడారు. నీట మునిగిన పంట పొలాలు, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్ధసారధి మీడియాతో మాట్లాడుతూ... వ్యవసాయం, యువతకు ఉపాధిపై సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
ప్రతీ రైతు సంతోషంతో వ్యవసాయం చేయడమేకాక, యువతను వ్యవసాయం వైపు మరల్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. వరినాటు యంత్రాలు, పంటకోత మిషన్లు, డ్రోన్ల ద్వారా ఎరువులు పురుగుమందులు చల్లడం వంటివి సాగులో ఆధునిక టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. డ్రోన్లలో కృత్తిమ మేథస్సును పెంచేందుకు అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు. డ్రోన్ల కొనుగోలుపై రైతులకు ప్రభుత్వం 50 శాతం వరకు సబ్సిడీని అందిస్తోందని మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు.