అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మోదీ లాంటి రాజనీతి గలవారి నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టం. భారతదేశ స్ధానాన్ని కమిటీలో సుస్ధిరం చేయడంతోపాటు ప్రపంచ స్ధాయి నాయకునిగా ఆయన ఎదిగారు. దేశాలను, జాతులను ఐక్యం చేయడంలో ప్రధాని కృషి ప్రశంసనీయం. ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రపంచ యవనికపై భారత్ పాత్రను రానున్న రోజుల్లో తెలియజేయనుంది’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
మరోవైపు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాలపై నిర్లక్ష్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఆనాటి భక్తుల మనోభావాలను పాలకులు భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకోవడంలో ఇబ్బంది లేదు. నిజంగా ఆయనకు శ్రీవారిపై విశ్వసం ఉందా లేదా అనేది ముఖ్యం అని వివరించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించారని మండిపడ్డారు. సంప్రదాయం ప్రకారం అన్యమతస్థులు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డిక్లరేషన్ ఇచ్చే బాధ్యతను జగన్ మరిచారని మండిపడ్డారు. సంప్రదాయాన్ని గౌరవించకుంటే తిరుమల ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. సంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయాలని గతంలో ప్రజలు అధికారం అప్పగించారు. అందుకు జగన్ విరుద్దంగా వ్యవహరించారు.