లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఢిల్లీలో రెండు రోజుల పాటు కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ రీజియన్ సదస్సు జరిగిందని ఏపీ శాసనమండలి ఛైర్మన్ కొయ్య మోషేను రాజు తెలిపారు. సదస్సుకు అన్ని రాష్ట్రాల స్పీకర్లు, శాసనమండలి చైర్మన్లు హాజరయ్యారన్నారు. కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ రీజియన్ సదస్సు అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరగనుందని.. దానికి ముందుగా స్పీకర్ ఓం బిర్లా ఒక సమావేశాన్ని నిర్వహించారని తెలిపారు. సమగ్ర అభివృద్ధి, కేంద్రం తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం వంటి అంశాలపై చర్చ జరిగిందన్నారు. శాసన సభ, శాసన మండలి నిర్వహణ మెరిట్, డి మెరిట్‌పై చర్చ జరిగిందన్నారు. ప్రజలకు కింది స్థాయి వరకు మెరుగైన అభివృద్ధి అందాలనే అంశంపై చర్చ జరిగినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి ఏపీ అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు.
పరిశ్రమలు అన్ని హైదరాబాద్‌లో ఉండడం వలన ఏపీ వెనకబడిపోయిందని చెప్పారు. ప్రత్యేక హోదా రాలేదని... రాష్టానికి రావాల్సిన ఇతర అంశాలపై ఏపీ అభివృద్ధి వెనకబడిపోయిందన్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఏపీ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లుగా రాజధాని లేకపోవడంతో కొంచం అభివృద్ధికి అటకం కలిగిందన్నారు. సభాపతులకు, శాసన మండలి చైర్మన్లు బడ్జెట్ ఖర్చు పెట్టే అధికారాలు ఉండాలన్నారు. సమావేశంలో కూడా అందరూ ఇదే అంశాన్ని లేవనెత్తారన్నారు. శాసన సభ, శాసన మండలి 60 రోజుల పాటు జరగాలని సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. రాష్టానికి రావాల్సిన నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని ఏపీ శాసనమండలి ఛైర్మన్ కొయ్య మోషేను రాజు వినతి చేశారు.