కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో అమలు చేసేందుకు ప్రయత్నించిన 3 వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. దేశ రాజధాని ఢిల్లీ, ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు, ఆందోళనలు నెలల పాటు సాగడంతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి.. ఆ 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుపుతూ దేశంలోని రైతులందరికీ క్షమాపణలు చెప్పి కంటతడి పెట్టుకున్నారు. అయితే ఈ వ్యవసాయ చట్టాలపై ఎప్పటినుంచో బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి స్పందించిన కంగన.. వాటిని మళ్లీ తీసుకువచ్చి అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన కంగనా రనౌత్.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతంలో అమలు చేయాలని ప్రయత్నించి.. వెనక్కి తీసుకున్న 3 వ్యవసాయ చట్టాలను తిరిగి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కొత్త వ్యవసాయ చట్టాలతో దేశంలోని రైతులకు మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో రైతులది కీలక పాత్ర అని పేర్కొన్న కంగన.. వారి అభివృద్ధి కోసం రద్దు చేసిన ఆ 3 వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకువచ్చి అమలు చేయాల్సిందేనని అన్నారు. దీంతో కంగనా రనౌత్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే రైతుల ఉద్యమంపై, ఈ 3 వ్యవసాయ చట్టాలపై కంగనా రనౌత్ మాట్లాడటం ఇదేం కొత్త కాదు. ఈ రైతు చట్టాలపై ఆమె వ్యవహార శైలి, చేస్తున్న వరుస వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త తలనొప్పిగా మారుతున్నాయి. దేశంలో 3 వ్యవసాయ చట్టాల రద్దు కోసం గతంలో రైతులు చేపట్టిన ఉద్యమాన్ని అడ్డుకోకపోయి ఉంటే భారత్ మరో బంగ్లాదేశ్ అయి ఉండేదంటూ కొన్ని రోజుల క్రితం కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణం అయ్యాయి. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ అధిష్ఠానం.. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో పార్టీకీ ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి అంటూ బీజేపీ ఒక ప్రకటన కూడా విడుదల చేయాల్సి వచ్చింది. అయితే ఈ వ్యవహారం పూర్తిగా మరిచిపోకముందే హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ సాగు చట్టాలను తిరిగి వెనక్కి తీసుకురావాలని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
కేంద్రం గతంలో తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన రైతుల్లో హర్యానాకు చెందిన అన్నదాతలు ఎక్కువ మంది ఉన్నారు. త్వరలోనే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న వేళ.. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓవైపు.. హర్యానాలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ హైకమాండ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ.. కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక గతంలో రైతు చట్టాలను సమర్థించినందుకు గాను.. ఎయిర్‌పోర్టులో విధుల్లో ఉన్న ఓ సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్.. కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన ఘటన తెగ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.