ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ లాగే మరో హీరోకు డిప్యూటీ సీఎం.. హింట్ ఇచ్చిన ముఖ్యమంత్రి

national |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 11:30 PM

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్.. ఎన్నిక కానున్నట్లు గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అధికార ద్రవిడ మున్నేట్ర కజగం - డీఎంకే పార్టీ నేతలు అయితే తమ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మాట్లాడిన తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మంగళవారం ఒక హింట్ ఇచ్చారు. త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవిపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఎంకే స్టాలిన్.. ప్రజల ఆశలను వమ్ము చేయమని తెలిపారు. దీంతో త్వరలోనే ఉదయనిధి స్టాలిన్.. డిప్యూటీ సీఎం అవుతారని డీఎంకే వర్గాల్లో జరుగుతున్న చర్చకు బలం చేకూరింది.


మంగళవారం మీడియాతో మాట్లాడిన సీఎం ఎంకే స్టాలిన్.. డిప్యూటీ సీఎం పదవి ఉదయనిధి స్టాలిన్‌కే కేటాయించనున్నట్లు హింట్ ఇచ్చారు. దీంతో పాటు తమిళనాడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ, ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవిపై విలేకరుల అడిగిన ప్రశ్నలకు ఎంకే స్టాలిన్ సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో నిరాశపడాల్సిన అవసరం లేదని.. తప్పకుండా మార్పు ఉంటుందని పేర్కొన్నారు. దీంతో తమిళనాడు డిప్యూటీ సీఎం పదవి ఉదయనిధి స్టాలిన్‌కే అని డీఎంకే శ్రేణులు కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. అయితే ఇటీవల వస్తున్న డిప్యూటీ సీఎం వార్తలపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్.. అదంతా ముఖ్యమంత్రి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఊహాగానాలను కొట్టిపారేశారు.


ప్రస్తుతం తమిళనాడు క్రీడా, యువజన శాఖ మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్‌.. డీఎంకే పార్టీ యూత్ విభాగానికి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పైగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఉదయనిధి స్టాలిన్.. గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ఆయన పేరు మొత్తం దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇక ఈ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఆయన సనాతన ధర్మంపై మరిన్ని వ్యాఖ్యలు చేయడంతో మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇక డీఎంకేలో ఎంకే స్టాలిన్ తర్వాత స్థానం ఉదయనిధి స్టాలిన్‌దేనని ఆ పార్టీ నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు.


ఇక ఈశాన్య రుతుపవనాలను ఎదుర్కొనేందుకు డీఎంకే సర్కార్ సిద్ధంగా ఉందని.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శితో చర్చించినట్లు ఎంకే స్టాలిన్ తెలిపారు. ఇటీవల అమెరికాలో పర్యటించి వచ్చిన స్టాలిన్.. అక్కడి నుంచి తీసుకువచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తమిళనాడులో ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై స్పందించిన సీఎం.. పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా ప్రకటన విడుదల చేశారని గుర్తుచేశారు. అమెరికా పర్యటన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం 18 కంపెనీలతో రూ.7,616 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com