హమాస్-ఇజ్రాయేల్ మధ్య యుద్ధంతో అట్టుడుకుతోన్న పశ్చిమాసియా మరోసారి రక్తమోడుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయేల్ సైన్యం భీకర దాడులతో విరుచుకుపడి రక్తపాతం సృష్టించింది. మరజుయాన్, టైర్, జహరానితో బెకా లోయలో యుద్ధ విమానాలు, డ్రోన్లతో నిప్పుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మరో 1,600 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో లెబనాన్ పౌరులకు ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. హెజ్బొల్లా ఉగ్రవాదులకు మానవ కవచాలుగా మారొద్దని ఓ సందేశం విడుదల చేశారు.
‘మా యుద్ధం హెజ్‌బొల్లాతోనే... దశాబ్దాలుగా హెజ్బొల్లా మిమ్మల్ని రక్షణ కవచాలుగా వినియోగించుకుంటోంది.. మీ నివాసాల్లో రాకెట్లు, క్షిపణులను దాచిపెడుతోంది. వాటిని మా నగరాలు, మా పౌరులపై ప్రత్యక్ష దాడులకు ఉపయోగిస్తోంది.. మా ప్రజలను రక్షించుకోవడం కోసం హెజ్బొల్లాపై దాడులు చేయడం తప్పట్లేదు.. మీ ఇళ్లల్లో దాచిపెట్టిన ఆయుధాలను నిర్వీర్యం చేయడం తప్పనిసరి.. ఉగ్రవాదుల కారణంగా మీతో పాటు మీ ప్రియమైనవారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టొద్దు... లెబనాన్‌ను నాశనం చేయనివ్వొద్దు. ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి ఇప్పుడే బయటపడండి.. మా హెచ్చరికలను తీవ్రంగా పరిగణించండి.. మా ఆపరేషన్ పూర్తయిన తర్వాత మీరు సురక్షితంగా మీ ఇళ్లకు తిరిగి రావొచ్చు’ అని నెతన్యాహు తన సందేశంలో పేర్కొన్నారు.
ఈ హెచ్చరికలను చూస్తుంటే లెబనాన్‌లో ఇజ్రాయేల్ దాడులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. హెజ్బొల్లా ఆయుధాలు దాచిన బెకా లోయనూ ధ్వంసం చేస్తామని ఇప్పటికే ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. లోయలోని పౌరులు తమ నివాసాలను తక్షణమే వీడి దూరంగా వెళ్లిపోవాలని ఇజ్రాయేల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డానియెల్ హగారీ తెలిపారు. గతేడాది అక్టోబరులో హమాస్-ఇజ్రాయేల్ యుద్ధం మొదలైన నాటి నుంచే హెజ్బొల్లా జోక్యం చేసుకుంటోంది. ఇప్పటివరకు ఇజ్రాయేల్‌పైకి దాదాపు 9వేలకు పైగా రాకెట్లను ప్రయోగించింది. ఒక్క సోమవారమే 250కి పైగా రాకెట్లతో దాడి చేయగా.. ఇజ్రాయేల్ డోమ్ వ్యవస్థ వాటిని ధ్వంసం చేసింది.