ఇప్పటి వరకూ గాజాకు మాత్రమే పరిమితమైన ఇజ్రాయేల్ దాడులు.. ప్రస్తుతం లెబనాన్‌కు మళ్లాయి. గతవారం రోజులుగా పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు, హెజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయేల్ సోమవారం భీకర దాడులతో విరుచుకుపడింది. సైదా, మరజుయాన్, టైర్, జహరానితోపాటు బెకా లోయలోని జిల్లాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఏకంగా వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో 24 మంది చిన్నారులు, 31 మంది మహిళలు సహా 356 మంది మృతి చెందగా.. మరో 1,246 మంది గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్యమంత్రి ఫిరాస్ అబియాద్ వెల్లడించారు. గత మంగళవారం నుంచి ఇజ్రాయేల్ జరిపిన వివిధ దాడుల్లో 5 వేల మంది గాయపడ్డారని ఆయన తెలిపారు.
ఇజ్రాయేల్ యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబులు వర్షం కురిపించడంతో దక్షిణ లెబనాన్‌లోని గ్రామాలు వణికిపోయాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వేలాది మంది రాజధాని బీరుట్‌వైపు పరుగులు తీస్తున్నారు. దాంతో రాజధానికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయి, ట్రాఫిక్ స్తంభించింది. గత 24 గంటల్లో బీరూట్ సహా లెబనాన్ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో హెజ్బొల్లా ఉగ్రవాదులకు చెందిన దాదాపు 1,300 లక్ష్యాలపై దాడిచేసినట్టు ఇజ్రాయేల్ సైన్యం ప్రకటించింది. వారి క్షిపణుల సహా ఆయుధాల నిర్వీర్యమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు పేర్కొంది. ఒక్క దక్షిణ ప్రాంతంలోనే 800 వరకు ఉన్నట్టు వెల్లడించింది.
గత రెండు దశాబ్దాలుగా హెజ్బొల్లా నిర్మించుకున్న యుద్ధ మౌలిక వసతులే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయేల్ ఆర్మీ చీఫ్ హెర్జీ హలేవీ అన్నారు. హెజ్బొల్లా కీలక స్థావరాల్లో ఒకటైన అలీ కర్కేపై జరిగిన దాడుల్లో ఆ సంస్థకు చెందిన కీలక కమాండోలు హతమైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలో ఇజ్రాయేల్-హెజ్బొల్లా మధ్య 34 రోజుల పాటు బీకర పోరు కొనసాగింది. 2006 ఆ తర్వాత ఈ రెండింటి మధ్య జరుగుతున్న అతి పెద్ద సంఘర్షణ ఇదే కావడం గమనార్హం. మరోవైపు ఇజ్రాయేల్‌కు చెందిన రెండు సైనిక స్థావరాలు సహా ఐదు లక్ష్యాలపై 125 రాకెట్లను ప్రయోగించినట్లు హెజ్బొల్లా ప్రకటించింది.
లెబనాన్‌పై తమ దాడుల పరంపర ఆగదని ఇజ్రాయేల్ స్పష్టంచేసింది. వారు ఆయుధాలను దాచిన బెకా లోయనూ ధ్వంసం చేస్తామని శపథం చేసింది. లోయలోని పౌరులు ఆయుధాలు దాచిన నివాసాలను వదిలి తక్షణం వెళ్లిపోవాలని ఇజ్రాయేల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డానియెల్ హగారీ తెలిపారు. ఈ హెచ్చరికలను లెబనాన్ పౌరులు తీవ్రంగా తీసుకోవాలని అటు ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెదిరింపులను నివారించడం ద్వారా ఉత్తర ప్రాంతాన్ని రక్షిత ప్రదేశంగా మార్చడానికి తాము ప్రయత్నిస్తున్నట్టు నెతన్యాహు అన్నారు.
హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్, నయీమ్ ఖాస్సేమ్ మాట్లాడుతూ.. ఇజ్రాయేల్‌తో యుద్ధం మరో దశకు చేరిందని, అన్ని సైనిక అవకాశాలకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సాయంతో ఈ బెకా లోయలోనే హెజ్‌బొల్లా 1982లో ఆవిర్భవించింది. గతేడాది అక్టోబరు 7 నాటి హమాస్ నరమేథానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్ భీకర దాడులను కొనసాగిస్తోంది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హౌతీలు కూడా ఇజ్రాయేల్‌ను టార్గెట్ చేశాయి.