ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ రూరల్ వికాస్ కాలేజీ వద్ద పెద్దవాగు పొంగి పొర్లుతోంది. దీంతో జగనన్న కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పెద్దవాగు కారణంగా నున్న వికాస్ కాలేజీకి రాకపోకలు బంద్ అయ్యాయి. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు.. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమైన పత్రాలు, విద్యార్థుల సర్టిఫికెట్‌లు , ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు కోల్పోయిన వారికి నకళ్లు జారికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఉచితంగా ముఖ్యమైన పత్రాలకు నకళ్ళు, డూప్లికేట్‌లను ఉచితంగా జారీ చేయాలని నిర్ణయిస్తూ.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ధ్రువపత్రాలు, డాక్యుమెంట్స్ నకళ్ళు జారీకి ఆయా ప్రభుత్వ శాఖలు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. జీవో జారీ చేసిన మరుసటి రోజు నుంచే వారం రోజులు పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.