అనంతపురం జిల్లాలో రెవెన్యూ అధికారుల అవినీతి దాహానికి ఓ రైతు బలయ్యాడు. వారసత్వంగా వచ్చిన తన భూమికి సంబంధించిన పాస్‌బుక్ ఇవ్వకుండా, లంచం ముట్టచెబితేనే ఇస్తామంటూ వేధింపులకు పాల్పడుతుండటంతో తట్టుకోలేని ఆ రైతు.. ఏకంగా జిల్లా కలెక్టరేట్‌లోనే పురుగుల మందు తాగాడు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. వివరాల ప్రకారం.. గార్లదిన్నె మండలం క్రిష్ణాపురం గ్రామానికి చెందిన సూర్యనారాయణ(54)కు బూదేడు సర్వే నంబరు 135-1లో 1.54 ఎకరాల భూమి ఉంది. ముగ్గురు అన్నదమ్ముల భాగాల పరిష్కారం తర్వాత ఆయనకు ఈ భూమి వాటాగా వచ్చింది. మిగిలిన ఇద్దరు సోదరులకు పాస్‌బుక్‌లు మంజూరు చేసిన రెవెన్యూ అధికారులు.. సూర్యనారాయణకు మాత్రం పాస్‌బుక్ ఇవ్వకుండా ఏడాదిగా తమ చుట్టూ తిప్పుకున్నారు.
డబ్బులు ఇస్తే గానీ పాస్‌బుక్ ఇప్పించేది లేదని వీఆర్‌ఓ మధు అన్నారని, దీంతో తహశీల్దారు కార్యాలయం చుట్టూ తన భర్త పలుమార్లు తిరిగాడని బాధిత రైతు భార్య ఈశ్వరమ్మ కంటతడి పెట్టుకుంది. తన భూమికి పాస్‌బుక్ మంజూరు విషయంపై సూర్యనారాయణ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో సైతం 3-4 సార్లు అర్జీ ఇచ్చాడు. మరోమారు కలెక్టరేట్‌లోని ప్రజాఫిర్యాదుల విభాగంలో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కలెక్టరేట్ ఆవరణలోని ఓ చెట్టుకింద కూర్చొని... ఎన్నాళ్లు తిరిగినా తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. గమనించిన పోలీసులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం బయటకు పొక్కకుండా సూర్యనారాయణను జిల్లా సర్వజన వైద్యశాలకు తరలించారు. సాయంత్రం 5 గంటలకు రైతు కుటుంబసభ్యులకు పోలీసులు సమచారం ఇచ్చారు. సూర్యనారాయణ భార్య ఈశ్వరమ్మ తన బంధువులతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. సూర్యనారాయణ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు. రెవెన్యూ అధికారుల అవినీతి కారణంగానే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని, తమకు న్యాయం చేయాలని ఈశ్వరమ్మ డిమాండ్ చేశారు. వీఆర్‌ఓపై చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు పోస్టుమార్టం చేయడానికి వీలులేదని రైతు బంధువులు ఆందోళన చేశారు. అనంతపురం ఆర్డీఓ వసంతబాబు ఆస్పత్రికి వచ్చి బాధితులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.