సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. సీఐడీ కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేశారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. విజయపాల్‌పై వచ్చిన ఆరోపణలు ఆందోళనకరమైనవి, తీవ్రమైనవని తెలిపింది. రఘురామపై కేసు వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని ఇరుపక్షాల వాదనలు బట్టి అర్థమవుతోందని.. ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యం ఉందనే కారణంతో ఉన్న వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉండలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
‘ఘటనలో రఘురామకు తీవ్ర గాయాలు కాలేదని ఎవరూ చెప్పలేరు. తప్పు చేసిన వ్యక్తులు పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ పెద్దలు అయినప్పుడు గాయాల తీవ్రత ముఖ్యం కాదు. నాలుగు గోడల మధ్య జరిగిన ఈ ఘటనను సామాన్యులు గమనించే అవకాశం లేదు. ఆ ప్రదేశం పిటిషనర్ (విజయపాల్) పూర్తి నియంత్రణలో ఉంది. ఆయన సీనియర్ పోలీసు అధికారి. ఆయనతో పాటు కేసులో ఉన్న సహ నిందితులూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. రఘురామపై కస్టడీలో దాడి జరిగిన సమయంలో పిటిషనర్ ఆ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతో విలువైనవి. వాటికి ముప్పుందని కస్టడీలో ఉన్న వ్యక్తులు ఫిర్యాదు చేస్తే.. వాటిని రక్షించడంలో సంబంధిత దర్యాప్తు అధికారి బాధ్యత మరింత పెరుగుతుంది. పౌరులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా చూడడం ఎంత ముఖ్యమో.. పౌరుల స్వేచ్ఛ, జీవనానికి ముప్పు వాటిల్లేలా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడడం న్యాయస్థానానికి అంతే ముఖ్యం. చట్టవిరుద్ధంగా వ్యవహరించి పౌరుల స్వేచ్ఛ, జీవనాన్ని హరించేలా విధులు నిర్వర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఎలాంటి లైసెన్సూ ఇవ్వలేదు. చట్టనిబంధనలు అమలు చేసే యంత్రాంగంలోని ఉన్నతాధికారి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో భిన్నమైన, కఠిన ప్రమాణాలు అనుసరించడం అవసరం. ఈ కేసులో విజయపాల్‌ను విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందస్తు బెయిల్ మంజూరు అందుకు అవరోధంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ మంగళవారం తీర్పు ఇచ్చారు. రఘురామరాజు ఫిర్యాదు ఆధారంగా గుంటూరు నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయ్‌పాల్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ.. బాధితుడు రఘురామరాజు తరఫున పీవీజీ ఉమేశచంద్ర, విజయపాల్ తరఫున సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు ముగిశాక తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం.. విజయ్‌పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ మంగళవారం నిర్ణయాన్ని వెల్లడించింది.