ప్రభుత్వం అక్టోబరు 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేయనుంది. ప్రభుత్వం మద్యం దుకాణాలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నాయకులు తాడి శివ, దుర్గరావు కోరారు. ప్రభుత్వం మద్యం దుకాణాలలో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఛలో భీమవరం ఐఎంఎఫ్‌ఎల్ డిపో కార్యక్రమం మహదేవపట్నం మద్యం డిపో వద్ద మంగళవారం నిర్వహించారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నామని నూతన మద్యం పాలసీ వల్ల తమ కుటుంబాల రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన విధానానికి తాము వ్యతరేకం కాదని తమకు ఇతర శాఖల్లో ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు. అనంతరం మద్యం డిపో వద్ద నిరసన తెలిపి సీఐ పద్మజకు వినతిపత్రం అందించారు. సీఐ పద్మజ మట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టి తీసుకువెళతామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రకాష్ రెడ్డి, క్రాంతి, రాజు, వినోద్, పెద్దిరాజు, ఉదయ్ కిరణ్ గౌడ్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సూపర్‌వైజర్లు, సేల్స్‌మన్ పాల్గొన్నారు.