దెబ్బతిన్న రహదారులను రూ. 297 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పార్థసారథి అన్నారు. కృష్ణా జిల్లా, ఆగిరిపల్లి మండలంలో రూ. 35.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రహదారులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. సగ్గూరులో రూ. 8.5 లక్షలతో యాదవుల బజారు వద్ద, కొమ్మూరులో రూ. 12.05 లక్షలతో, వట్టిగుడిపాడులో రూ. 14.55 లక్షలతో నిర్మించనున్న సీసీ రహదారులకు మంత్రి సారథి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, గోతుల రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వర్షాలు పూర్తిగా తగ్గిన తరువాత రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లను అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. నూజివీడు ఆర్డీవో వై.భవాని శంకరి, రహదారులు, భవనాల శాఖ ఎస్‌ఈ జాన్‌మోషే, ఉద్యానవన శాఖ డీడీ రామ్మోహన్, తహసీల్దార్ టి.ఎన్.వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.