కార్పొరేట్ కంపెనీల్లో తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు అనారోగ్యానికి గురై చనిపోవడం లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు గత కొన్ని రోజులుగా దేశంలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా గంటల తరబడి కంప్యూటర్ ముందు కుర్చీలో కూర్చొని తిండి, నిద్ర లేకుండా పనిచేస్తుండటంతో మానసికంగా, శారీరకంగా సమస్యలు రావడంతో తట్టుకోలేక కొందరు ఆరోగ్యం చెడిపోయి చనిపోతూ ఉంటే.. మరికొందరు మాత్రం పని ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
కొన్ని రోజుల క్రితం పూణేలో యువ సీఏ అనారోగ్యంతో చనిపోగా.. కనీసం ఆమె అంత్యక్రియలకు కూడా ఆ కంపెనీ ఉద్యోగులు వెళ్లకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల క్రితం చెన్నైలో ఓ టెకీ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కరెంట్ వైరు పట్టుకుని చనిపోయిన ఘటన మర్చిపోకముందే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ ఉద్యోగి ఆఫీసులోనే అనుమానాస్పద స్థితిలో చనిపోవడం పెను దుమారం రేపుతోంది. రాజధాని లక్నోలోని విభుతిఖండ్ ప్రాంతంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పనిచేసే 45 ఏళ్ల సాదాఫ్ ఫాతిమా అనే మహిళ.. ఆఫీస్‌లో పనిచేస్తూనే కుర్చీలో కూలబడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
దీంతో ఆమె మృతికి కారణాలు అన్వేషించేందుకు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు విభుతిఖండ్ ఏసీపీ రాధారమణ్ సింగ్ వెల్లడించారు. సాదాఫ్ ఫాతిమా పని ఒత్తిడికారణంగానే చనిపోయినట్లు ఇక అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పనిచేసే తోటి ఉద్యోగులు పేర్కొన్నారు. ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీకి చెందిన మహారాష్ట్రలోని పూణే బ్రాంచ్‌లో పనిచేసే కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ అనే 26 ఏళ్ల యువ సీఏ.. అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశం మొత్తం దుమారం రేపుతున్న వేళ.. సాదాఫ్ ఫాతిమా మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు.. దేశ ప్రస్తుత ఆర్థిక ఒత్తిడిని తెలుపుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం, కంపెనీలు.. తమ పని పరిస్థితులు, ప్రాధాన్యతలను మరోసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలపై అన్ని కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు ఆలోచించాలని ట్వీట్ చేశారు. ఏ దేశానికైనా నిజమైన అభివృద్ధి ఏంటంటే సేవలు, ఉత్పత్తుల పెరుగుదల కంటే మనుషులు శారీరకంగా, మానసికంగా, ఉల్లాసంగా ఉండటమేనని నొక్కి చెప్పారు. పని ఒత్తిడితో ఉద్యోగులు చనిపోవడం బాధాకరమని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.