ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్.. ఉచితంగా ప్రయాణం, డ్రైవర్ లేకుండానే పరుగులు

national |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2024, 09:58 PM

దేశంలో రకరకాల ట్రైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మన దేశంలో ఎన్నో రైళ్లు ఉండగా.. గత కొన్నేళ్లుగా వందే భారత్‌ పేరుతో అత్యాధునిక రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. వందే భారత్ మెట్రో(నమో భారత్) రైళ్లు ఇటీవలే ప్రారంభం కాగా.. ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు, తోపాటు బుల్లెట్ ట్రైన్ కూడా త్వరలోనే పట్టాలు ఎక్కనున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోనే మరో హై టెక్నాలజీ రైలు కూడా అందుబాటులోకి రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించారు. అదే ఎయిర్ ట్రైన్. డ్రైవర్ లేకుండానే పట్టాలపై పరుగులు తీయడం ఈ ఎయిర్ ట్రైన్ స్పెషాలిటీ. అంతేకాకుండా వీటిలో ప్రయాణికులకు ఉచితంగానే ప్రయాణం కల్పించనున్నారు.


దేశంలోనే అతి పెద్దదైన ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో.. ఈ తొలి ఎయిర్ ట్రైన్‌ అందుబాటులోకి రానుంది. 2027 నాటికి ఈ ఎయిర్ ట్రైన్‌ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎయిర్ ట్రైన్‌ను (ఆటోమేటెడ్ పీపుల్ మూవర్-ఏపీఎం) అని కూడా పిలుస్తారు. చూడటానికి మెట్రో రైలు మాదిరిగానే ఉండే ఈ రైలులో ప్రత్యేకత డ్రైవర్ అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా ప్రయాణం చేస్తుంది.


ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని మూడు టెర్మినళ్ల మధ్య ప్రయాణికులు ప్రయాణించేందుకు లేదా విమానం దిగిన ప్రయాణికులు బయటికి వచ్చేందుకు బస్సు సర్వీసులను మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆ బస్సుల స్థానంలోనే ఈ ఎయిర్ ట్రైన్లను తీసుకురానున్నారు. బస్సుల ద్వారా ప్రయాణికులను ఒక టెర్మినల్ నుంచి మరో టెర్మినల్‌కు తరలించేందుకు.. ప్రయాణికులు విమానం దిగిన తర్వాత బస్సులో బయటికి వెళ్లేందుకు ఆలస్యం అవుతోంది. ఈ ఆలస్యాన్ని తగ్గించి.. విమాన ప్రయాణికులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకే ఈ ఎయిర్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చే విమాన ప్రయాణికుల కోసం రూ.2 వేల కోట్లతో ఈ ఎయిర్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎయిర్‌పోర్టులోని టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3ల మధ్య మొత్తం 7.7 కిలోమీటర్ల పొడవున ఈ ఎయిర్ ట్రైన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2027 చివరి నాటికి ఈ దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఎయిర్ ట్రైన్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నడుస్తున్న డీటీసీ బస్సుల సేవలు నిలిచిపోనున్నాయి.


ఇక ఈ ఎయిర్‌ ట్రైన్‌ అనేది పరిమిత సంఖ్యలో కంపార్ట్‌మెంట్‌లను కలిగి ఉంటుంది. ఇది ట్రాక్‌లపై నడుస్తూ ఉంటుంది. నిర్ణీత ట్రాక్‌లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులువుగా, వేగంగా ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని ఇతర టెర్మినళ్లు, పార్కింగ్, క్యాబ్ పికప్ పాయింట్లు, హోటళ్లు మొదలైన వాటిని చేరుకోవడానికి ఈ ఎయిర్‌ ట్రైన్‌ను నడపనున్నారు. ఈ తొలి ఎయిర్ టైన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన బిడ్లను ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో స్వీకరించనున్నారు. ఇందులో ప్రాజెక్ట్ దక్కించుకున్న వారికి ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ప్రక్రియ మొత్తం పూర్తి చేసి.. తర్వాత పనులు వెంటనే ప్రారంభించనున్నారు.


ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. మన దేశంలోనే అత్యంత రద్దీ అయిన ఎయిర్‌పోర్ట్‌గా నిలిచింది. ఏటా 7 కోట్లకుపైగా ప్రయాణికులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాకపోకలు చేస్తుండగా.. వచ్చే 6 నుంచి 8 ఏళ్లలో ఈ సంఖ్య 13 కోట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చే వారిలో 25శాతం మంది ప్రయాణికులు టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక ఈ ఎయిర్ ట్రైన్‌లో అంతర్జాతీయ ప్రయాణికులకు ఉచితంగానే ప్రయాణాన్ని అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com