తమిళనాడులోని ఉలుందూరుపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్టటూరు సమీపంలో టూరిస్ట్ వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.. మరో 16 మంది గాయపడ్డారు. వీరిని వెంటనే విల్లుపురం ముండియంబాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారుటూరిస్ట్ వాహనంలో ఉన్నవారు తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. వాహనం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.
చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.. వీరు అరణి సమీపంలోని మంబాక్కం నుంచి తిరుచెందూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, కళ్లకురిచ్చి జిల్లా సూపరింటెండెంట్ రజత్ చతుర్వేది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో.. పోలీసులు క్లియర్ చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, చనిపోయిన వారి వివరాలు, ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, కొద్ది రోజుల కిందటే తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదమే చోటుచేసుకుంది. రద్దీగా ఉండే చెన్నై ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో ఓ కారును.. స్టేషనరీతో వెళ్తోన్న లారీ ఢీకొట్టింది. అనంతరం కారును కొద్దిదూరం వరకూ ఈడ్చుకెళ్లింది. దీంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సెమ్మన్‌చేరీ కుప్పం బస్టాండు సమీపంలో సెప్టెంబరు 4న జరిగిన ఈ ప్రమాదానికి అతివేగమే కారణం. వేగంగా వాహనం నడుపుతూ అక్కడ ఉన్న బారికేడ్లను ఢీకొట్టాడు. అనంతరం అదుపుతప్పి కారుపైకి దూసుకెళ్లాడు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు.