తిరుమల లడ్డూ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పేర్నినానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కలుగులో ఉన్న ఎలుకలు మళ్లీ బయటకి వచ్చాయంటూ వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖ మంత్రిగా పని చేసి బందరు బస్టాండ్ అభివృద్ధి చేయలేదన్నారు. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని.. పళ్లు రాలిపోతాయంటూ హెచ్చరించారు. ‘‘మొన్న గుడివాడలో కొట్టినా నీకు సిగ్గు రాలేదా. ఈసారి బందరు ప్రజలే నిన్ను తరమి కొడతారు. కలియుగదైవం వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేని వ్యక్తి జగన్ . అతన్ని వెనుకేసుకు రావడానికి నీకు సిగ్గు, బుద్ధి ఉందా. వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉంటే సతీసమేతంగా ఇవ్వాల్సిన పట్టు వస్త్రాలను గడిచిన ఐదేళ్లలో ఒక్కసారైనా ఇచ్చారా.. మీ నాయకుడి దగ్గరకు వెళ్లి ముందు చొక్కా పట్టుకుని అడుగు. ఇంకోసారి నోటికొచ్చినట్లు వాగితే ... నోరు మూసుకునేలా బుద్ధి చెబుతాం’’ అంటూ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో హెచ్చరించారు.