సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఏపీ సర్కార్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. వెంకట్రామిరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఈ మేరుకు సాధారణ పరిపాలన శాఖ నోటీసులు అందజేసింది. ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదో తెలియచేయాలంటూ జీఏడీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. వెంకటరామిరెడ్డి అందుబాటులో లేకపోవటంతో అప్సా తరపున ప్రభుత్వానికి కార్యదర్శి కృష్ణ, ఇతర ఆఫీసుబేరర్లు సమాధానం ఇచ్చారు. వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత హోదాలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ప్రభుత్వానికి అప్సా కార్యదర్శి, ఆఫీసు బేరర్లు వివరణ ఇచ్చారు. సచివాలయానికి వెలుపల చేసిన కార్యకలాపాల గురించి తమను ఎప్పుడూ సంప్రదించలేదని సాధారణ పరిపాలన శాఖకు వివరించారు. సంఘం అధ్యక్షుడిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఉంటే ఆయనపైనే చర్యలు తీసుకోవాలని లేఖలో అప్సా ఆఫీసు బేరర్లు విజ్ఞప్తి చేశారు. ఒక వ్యక్తి గురించి సంస్థ గుర్తింపు రద్దు చేసే నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి అప్సా కార్యదర్శి కృష్ణ, ఇతర ప్రతినిధులు వినతి చేశారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్టు అప్సా ప్రధాన కార్యదర్శి పి.కృష్ణ ప్రకటించారు.