నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో ఏపీ సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్డీయే ప్రభుత్వంలో పదవిని అహంకారంగా భావించకుండా బాధ్యతతో మెలగాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "ఎన్డీయే ప్రభుత్వంలో పదవి అనేది బాధ్యత. మనలో ఎక్కడా అహంకారం కనిపించకూడదు. ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులమనే గుర్తు పెట్టుకోవాలి. ప్రజల కంటే మనం ప్రత్యేకమని భావించకూడదు. మన నడవడిక, తీరు ప్రజలు గమనిస్తారు.
మన ప్రతి కదలికా, మాటా, పని గౌరవంగా, హుందాగా ఉండాలి. ముందుగా చెప్పినట్లు మూడు పార్టీల వారికి పదవులు ఇచ్చాం. మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేకమైన విధానాన్ని పాటించాం. మంచి ఫలితాలు వచ్చాయి. నేడు నామినేటెడ్ పదవుల విషయంలో మంచి కసరత్తు చేసి పదవులు ప్రకటించాం. ఫేజ్- 1లో ముందుగా కొందరికే పదవులు ఇవ్వగలిగాం. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. కొందరు నాయకులు తొందరపడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మన పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ ఇవ్వలేకపోయిన వారికి మొదటి లిస్టులో కొంతవరకూ అవకాశం కల్పించాం. కష్టపడిన వారికి మొదటి లిస్టులో ప్రాధాన్యం ఇచ్చాం. మిగిలిన వారికీ అవకాశాలు వస్తాయి. అంటే.. మిగిలిన వారు పనిచేయలేదని అర్థం కాదు. పార్టీ కోసం జైలుకు వెళ్లిన వారు, ఆస్తులు కోల్పోయిన వాళ్లు, కేసులు ఎదుర్కొన్న వారు ఉన్నారు. పార్టీకి ఎవరు ఎలా పనిచేశారో నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. టీడీపీ కోసం నిరంతరం పనిచేసిన వాళ్లూ ఉన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చెయ్యాలనే విషయంలో స్పష్టంగా ఉన్నాం అని తెలిపారు.