రాజకీయ పార్టీలతో పాటు హైందవ సంఘాలు సైతం తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. తిరుమలలో జగన్ డిక్లరేషన్‌పై ఆ పార్టీ మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వివాదంలో వస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తేనే జగన్ డిక్లరేషన్ ఇస్తారని చెప్పారు.
జగన్ డిక్లరేషన్‌కు, లడ్డూ వివాదానికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఆ పార్టీ నేత వంగా గీత రెండింటికి ముడిపెట్టడం ద్వారా ప్రతి విషయాన్ని వైసీపీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోందని, భక్తుల విశ్వాసాలను గౌరవించడం లేదని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇతర మతస్తులు ఎవరైనా తిరుమల వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనే విషయం తెలిసినా.. ఈ అంశాన్ని వైసీపీ ఎందుకు రాజకీయం చేస్తోందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జగన్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. డిక్లరేషన్ ఇచ్చి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారా.. డిక్లరేషన్ అడిగారనే నెపంతో.. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.