రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం ఆరున్నర గంటలకు సింహాచలం వరాహనరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయం ప్రధాన అర్చకులు, అధికారులు లోకేష్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కప్పస్తంభం ఆలింగం స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు మంత్రి లోకేష్‌కు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు.
కాగా విశాఖ ఎంపీ భరత్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు లోకేష్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలను మంత్రి లోకేష్ కలుసుకుంటారు. సమయాన్ని బట్టి కార్యకర్తలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. తరువాత నగరంలో మునిసిపల్ పాఠశాలలను సందర్శిస్తారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. జిల్లా విద్యాశాఖకు కూడా సమాచారం ఇవ్వలేదు. నగరంలో పాఠశాలల వివరాలు ఇప్పటికే సేకరించిన లోకేశ్, ఆకస్మికంగా ఒకటి, రెండు పాఠశాలలను సందర్శించవచ్చునని సమాచారం.