రాజకీయాల్లో ఐదేళ్ల కాలంలో అద్భుతాలు చేయొచ్చని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడలో ఏపీసీసీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో రాజకీయంగా నిలబడటం, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. అన్ని పార్టీల నుంచి కాంగ్రె్‌సలోకి చేరికలు ఉండేలా చూసుకోవాలని నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మనుగడ రాష్ట్రానికెంతో అవసరమని చెప్పారు. బూత్ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం జరగాలని వ్యాఖ్యానించారు. పార్టీలో పాత, కొత్త నాయకులందరినీ కలుపుకొని పోవాల్సి ఉందన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌పై ఉన్న వ్యతిరేకత వల్లే చంద్రబాబుకు ఓట్లుపడ్డాయని, కూటమిపై ప్రేమతో ప్రజలు ఓట్లు వేయలేదని చెప్పారు. చంద్రబాబు వద్దనుకున్నవాళ్ల ఓట్లు 38శాతంగా నమోదైందన్నారు. స్థానిక ఎన్నికలను కార్యకర్తలు సవాల్‌గా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పార్టీ విజయంపై అధిష్ఠానం ఫోకస్ పెట్టిందని, జాతీయ స్థాయిలో నేతలు రాష్ట్రానికి వస్తారని, వారినుంచి కూడా సపోర్టు ఉంటుందని, రాష్ట్ర సమస్యలపై ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం అన్నారు. బీజేపీపై చంద్రబాబు, జగన్ మాట్లాడరని, ఒకరు అధికారికంగానూ, మరొకరు లాలూచీతోనూ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ చేసిన అన్యాయంపై అక్టోబరు 2న నిరసన చేపడదామన్నారు.