నూతన మద్యం పాలసీ విడుదలకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. నేడో రేపో నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,736 షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో 340 షాపులను కల్లు గీత కార్మికులకు కేటాయించింది. మిగిలిన 3,396 షాపులను లాటరీ విధానంలో కేటాయిస్తారు. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజులకు నాలుగు శ్లాబులను ఎక్సైజ్ శాఖ రూపొందించింది. 10 వేల మంది లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు లైసెన్సు ఫీజుగా చెల్లించాలి. 10 వేలు దాటి 50 వేల మంది వరకు రూ.55 లక్షలు.. 50 వేలు పైబడి 5 లక్షల మంది వరకు ఉన్న చోట్ల రూ.65 లక్షలు.. 5 లక్షల మందికిపైగా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలను ఫీజుగా నిర్ణయించారు. ఈ ఫీజులను ఏడాదిలో ఆరు విడతల్లో చెల్లించే వెసులుబాటు వ్యాపారులకు కల్పిస్తున్నారు. ఏటా 10 శాతం పెంచుతారు.
రూ.50 లక్షల శ్లాబు పరిధిలోనే ఎక్కువ షాపులు (1,310) ఉన్నాయి. రూ.55 లక్షల శ్లాబులో 1,032, రూ.65లక్షల పరిధిలో 1,119, రూ.85 లక్షల పరిధిలో 275 దుకాణాలు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264 షాపులున్నాయి. వాటిలో 24 గీత కార్మికులకు కేటాయించారు. తర్వాతి స్థానం పశ్చిమ గోదావరి జిల్లాది (225). అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 37 షాపులు, పార్వతీపురం మన్యంలో 58 షాపులు ఉన్నాయి. మద్యం షాపుల పనివేళలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. అలాగే మొత్తం షాపులను ప్రభుత్వం రెండు విధాలుగా వర్గీకరించింది. 3,736లో గీత కులాలకు కేటాయించిన 340 షాపులకు విడిగా నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. మిగిలిన 3,396 షాపులకు శుక్రవారం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటివారంలోగా ఈ పాలసీని అమల్లోకి తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ సంకల్పించింది. అప్పటివరకూ ప్రభు త్వ మద్యం షాపులు కొనసాగుతాయి. ఆ తర్వాత గీత కార్మికులకు కేటాయించిన 340 షాపులకు మరో నోటిఫికేషన్ ఇస్తారు. ఎలైట్ షాపులకు కూడా ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.