కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు అడ్డాగా మారిందని, దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఆదివారం తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేరుగ మాట్లాడారు. అరాచకాలకు అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారిందని, రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా గత తప్పిందని మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఫైర్ అయ్యారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తుండగా, కూటమి నేతలు దగ్గరుండి దాడులు చేయిస్తున్నారని.. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా అవన్నీ సాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన పేరుతో యథేచ్ఛగా దౌర్జన్యం జరుగుతోందన్న మాజీ మంత్రి.. ఎమ్మెల్యేల అకృత్యాలు, వేధింపులు సీఎం చంద్రబాబుకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే.. ఆ ఎమ్మెల్యేల మక్కెలు విరగ్గొట్టాలని ఆయన సవాల్ చేశారు. ఎన్నికల్లో చెప్పిన మాటలు నమ్మి కూటమిని భారీ మెజారిటీతో గెలిపిస్తే హామీలు అమలు చేయకపోగా రెడ్ బుక్ పేరుతో ఎమ్మెల్యేలే బెదిరింపులు, దాడులు, అకృత్యాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా సీఎం నోటి నుంచే మక్కెలు విరగ్గొడతామంటున్న మాటలు, కూటమి ఎమ్మెల్యేలను మరింత ఎగదోస్తున్నాయని, దీంతో వారు వీధి రౌడీల్లా దాడులకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు కదిలినా మెదిలినా కేసులంటూ వేధిస్తున్నారని, ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేసే స్థాయికి పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని మెరుగు నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా ప్రజలంతా నిశ్చింతగా బతికితే, ఇప్పుడు చంద్రబాబు మూడు నెలల పాలనకే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ లాంటి వారితో సొంత పార్టీ నాయకులు సైతం బెంబేలెత్తిపోయేలా బాబు పాలన ఉందని మాజీ మంత్రి గుర్తు చేశారు. చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నా, మక్కెలు విరగ్గొట్టాలన్నా రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారంటూ.. వారందరినీ ప్రస్తావించారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జొజ్జల సుధీర్‌రెడ్డి, రఘురామకృష్టంరాజు, సుందరపు విజయ్‌కుమార్, పంతం నానాజీ, మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్, గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే భర్త, భూమా అఖిలప్రియ, జేసీ అస్మిత్‌రెడ్డి.. తదితరులు 100 రోజుల్లో రాజ్యాంగాన్ని అతిక్రమించి చేసిన అరాచకాలు చాలా ఉన్నాయని, దమ్ముంటే చంద్రబాబు వారిపై చర్యలు తీసుకోవాలని మెరుగు నాగార్జున సవాల్ చేశారు.