రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని, కూటమి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా ఈవీఎంల ద్వారా వచ్చిన ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేల నుంచి సీఎం వరకూ అందరూ దోచుకునే పనిలో బిజీగా ఉన్నారన్న ఆయన, రాష్ట్రంలో ఏ పథకం అమలు చేయకపోయినా, సీఎం చంద్రబాబు వేల కోట్లు అప్పులు చేస్తున్నారని, వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 100 రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన సీఎం చంద్రబాబు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఆ దిశలోనే పవిత్రమైన టీటీడీ ప్రతిష్టను సైతం దిగజారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆక్షేపించారు.
రాజకీయ ప్రయోజనం కోసం చివరకు దేవుణ్ని కూడా వినియోగించడం కేవలం చంద్రబాబుకే చెల్లిందని చెప్పారు.తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగించారని ఆరోపిస్తున్న చంద్రబాబు, ఆ నెయ్యి తమ ప్రభుత్వ హయాంలోనే సరఫరా అయిందన్న విషయం మర్చిపోతున్నారని రవీంద్రనాథ్‌రెడ్డి గుర్తు చేశారు. జూన్ 12 నుంచి జూలై 4 వరకు వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీలో నాణ్యత పరీక్ష తర్వాత వినియోగించారని, ఆ తర్వాత జూలై 6న వచ్చిన రెండు ట్యాంకర్లు, జూలై 12న వచ్చిన మరో రెండు ట్యాంకర్ల నెయ్యిలో కల్తీని గుర్తించడంతో వెనక్కి పంపారని తెలిపారు. అలాంటప్పుడు అసలు కల్తీ నెయ్యిని ఎక్కడ వాడారని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, ఉన్నతస్థాయి విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు. తిరుమలకు వచ్చే నెయ్యి నాణ్యత పరీక్షకు గతంలో మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)కు పంపే వారని గుర్తు చేసిన వైయస్సార్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు, తొలిసారిగా గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు)కు పంపడం వెనకున్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. అంతకు ముందు రోజే ఎన్‌డీడీబీ ఛైర్మన్ వచ్చి టీటీడీ ఈఓను కలిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదంతా ఒక గూడుపుఠాణీలా జరిగిందని చెప్పారు. టీటీడీ లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వినియోగ దుష్ప్రచారం బెడిసి కొట్టి, ఆధారాలతో సహా ప్రజల ముందు దోషిగా నిలబడ్డ చంద్రబాబు.. డైవర్షన్ కోసం జగన్‌గారి తిరుపతి పర్యటనపై రగడ సృష్టించారని మాజీ ఎమ్మెల్యే చెప్పారు. అది ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఆడిన డ్రామా అని అభివర్ణించారు. ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనవ్రతం పాటిస్తున్నారన్న రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన విజయవాడ వరద బాధితులను కూడా ఆయన పరామర్శించలేదని గుర్తు చేశారు.