నేత వృత్తినే నమ్ముకున్న వారికి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని.. చేనేతకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటుందని.. బీసీ, చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని తన స్వగహంలో మంత్రి సోమవారం విలేకరులతో మాట్లాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌లో ఏపీకి చెందిన చేనేత కార్మికులతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 80 చేనేత కార్మిక సంఘాలు, సొసైటీలు పాల్గొంటాయని తెలిపారు. ఎగ్జిబిషన్‌లో నూలు చీరలు, పట్టు చీరలు, పావడాలు, డ్రస్ మెటీరియల్స్ విక్రయిస్తామని తెలిపారు. నేతన్నకు అండగా ఉండాలనే లక్ష్యంతో పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.