ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం విరాళాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలువురు వ్యక్తులు, సంస్థల ప్రతినిధులు తమవంతుగా సాయం చేస్తున్నారు.. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. ఏపీ వరద బాధితుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేశారు. ఆ మొత్తం రూ.5,90,01,087 చెక్కును బ్యాంక్ సీఈవో, ఎండీ ఎ.మణిమేఖలై ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.
సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సి నాగేశ్వరావురూ. కోటి విరాళం చెక్కును చంద్రబాబు ఇచ్చారు. ఆర్జా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.కోటి.. కేరళకు చెందిన పెన్వర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎండీ ఫిలిప్స్ థామస్ రూ.50 లక్షలు అందజేశారు. విజయవాడకు చెందిన ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ రూ.50 లక్షల విరాళం ఇచ్చింది. బెంగళూరుకు చెందిన తెలుగు విజ్ఞాన సమితి ప్రతినిధులు రూ.25 లక్షలు ఇచ్చారు.
అలాగే శశి విద్యా సంస్థల తరఫున రూ.25 లక్షల విరాళమిచ్చారు. అంతేకాదు అనంతపురానికి చెందిన కేఎం షకిల్ షఫి ఏపీ వక్ఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, ముతావల్లీస్ అండ్ మేనేజింగ్ కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.7.86 లక్షల విరాళం అందజేశారు. జంపాల భావనారాయణ, శారద అనే వృద్ధులు రూ.లక్ష చెక్కు, 16 గ్రాముల బంగారు బ్రేస్‌లెట్‌ని విరాళంగా ఇచ్చారు. శ్రీ విజయ ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.10 లక్షలు, ముక్కామల అప్పారావు రూ.10 లక్షలు, చిన్మయి ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవల్‌పమెంట్ రూ.10 లక్షలు, జయశ్రీ పాలిమర్స్ రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం, ఇసుక, ఫైబర్‌నెట్ స్కాంలపై నమోదైన కేసుల దర్యాప్తుపై సమీక్ష నిర్వహించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీ హరీష్‌కుమార్ గుప్తా, ఇంటిలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డాలతో సీఎం చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, నేర నియంత్రణపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన ఘటనలపైనా చర్చ జరిగింది. ఎవరైనా రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తే ఉపేక్షించొద్దని అధికారులకు చంద్రబాబు సూచించారు. సీఐడీ దర్యాప్తు చేస్తున్న మద్యం కుంభకోణం, మదనపల్లె ఫైళ్ల దహనం కేసుల దర్యాప్తు ఆరా తీశారు. టీటీడీలో అవకతవకలు, జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు, ఫైబర్‌నెట్ కుంభకోణం వంటి కేసుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపట్టిన విచారణ నివేదికలపై కూడా సమీక్ష చేశారు చంద్రబాబు.