హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా లెబనాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయేల్.. యుద్ధాన్ని మరో దశకు తీసుకెళ్లింది. సోమవారం నుంచి లెబనాన్‌పై భూతుల దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇరాన్ పౌరులకు సంఘీభావంగా మాట్లాడిన ఆయన.. అయతుల్లా ఖమేనీకి గట్టి హెచ్చరికలు పంపారు. తర్వలోనే మీ నిరంకుశ పాలనను అంతం చేసి ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛావాయువులు అందిస్తామని, వారికి ఇజ్రాయేల్ ఎప్పటికీ అండగా ఉంటుందని ఉద్ఘాటించారు.
‘ప్రతి రోజూ మీ పాలకులు మిమ్మల్ని అణచివేస్తూ గాజా, లెబనాన్‌ను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తూనే ఉన్నారు.. వారి చర్యల కారణంగా మన ప్రాంతం మరింత చీకట్లోకి వెళ్తోంది.. నానాటికీ యుద్ధం తీవ్రమవుతోంది.. ఇరాన్ నిరంకుశ పాలకులు మీ భవిష్యత్తు గురించి పట్టించుకోవడం లేదని మీలో చాలా మందికి తెలుసు.. మీ గురించి వాళ్లు ఆలోచించి ఉంటే.. మధ్యప్రాచ్యంలో కోట్లాది డాలర్లను యుద్ధాల కోసం ఖర్చుచేయరు.. దాన్ని అణ్వాయుధాల కోసం కాకుండా.. మీ జీవితాలను బాగు చేయడానికి ఉపయోగించేవారు.. మీ పిల్లల విద్య, ఆరోగ్యం, దేశ మౌలిక సౌకర్యాల అభివృద్ధికి వినియోగించేవారు. కానీ, మీ పాలకులు అలా చేయడం లేదు’ అని నెతన్యాహు వెల్లడించారు.
‘హెజ్బొల్లా ఉగ్రవాదులు, అత్యాచారం చేసేవారిని మీరు సమర్థించరని నాకు తెలుసు.. కానీ, మీ పాలకులు అలా కాదు.. అందుకే, ఇరాన్ కీలుబొమ్మలను మేం ఒక్కొక్కటికీ పెకిలించివేస్తున్నాం.. మా దేశాన్ని, ప్రజలను కాపాడుకోవడం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం. ఇలాంటి పాలకులు మీకు అవసరం లేదు... త్వరలోనే ఆ నిరంకుశ పాలన నుంచి మీకు విముక్తి కల్పిస్తాం.. అప్పుడు రెండు దేశాల్లో మళ్లీ శాంతి నెలకొంటుంది’ అని నెతన్యాహు పరోక్షంగా ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరంకుశ పాలన ముగిసిన తర్వాత ఇరాన్.. ప్రపంచ పెట్టుబడులు, పర్యాటకం, ఆధునిక సాంకేతికతతో సుసంపన్నమవుతుందని అన్నారు.
‘పురాతన జ్యూయిష్, పర్షియన్ ప్రజలకు చివరిగా శాంతి నెలకుంటుంది.. ఆ రోజు వచ్చినప్పుడు ఐదు ఖండాలలో ఉగ్రవాదులు నిర్మించుకున్న సామ్రాజ్యం విచ్ఛిన్నమవుతుంది... ఇరాన్ మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ పెట్టుబడి; భారీ పర్యాటకం; ఇరాన్‌లో ఉన్న అద్భుతమైన ప్రతిభ ఆధారంగా అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణ.. అంతులేని పేదరికం, అణచివేత, యుద్ధం కంటే ఇది మంచిది కాదా?’ అని నెతన్యాహు పేర్కొన్నారు.
గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయేల్‌లోకి చొరబడిన హమాస్ సాయుధులు..మారణహోమానికి పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్ మొదలుపెట్టిన యుద్ధం ఇప్పుడు మరింత విస్తరించింది. నిన్నమొన్నటి వరకూ గాజాపై భీకర దాడులు సాగించిన టెల్ అవీవ్.. ఇప్పుడు హెజ్బొల్లాను టార్గెట్ చేసింది. ఇప్పటికే ఆ సంస్థ అధినేత నస్రల్లాను మట్టుబెట్టింది. మరోవైపు, సుదీర్ఘ యుద్ధానికి తాము కూడా సిద్ధమేనని హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్ చేసిన ప్రకటనతో పశ్చిమాసియాలో ఇప్పట్లో శాంతి నెలకునే పరిస్థితి కనుచూపుమేరలో కనిపించడం లేదు.