ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక ప్రకటన చేశారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. సంక్రాంతి నుంచి రాష్ట్రంలో P4 విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి ఏపీలో పీ 4 కార్యక్రమం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. పేదరికం లేని సమాజమే నిర్మాణంగా ఈ పీ4 కార్యక్రమం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. డ్వాక్రా సంఘాలకు ఎస్ఎంఎస్‌ఈ హాదా కల్పిస్తామని.. డ్వాక్రా సంఘాల తరహాలోనే స్వచ్ఛ సేవకులు కోసం కూడా గ్రూపులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
అసలేంటీ పీ4 మోడల్..?
పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు ప్రతిపాదించిన విధానమే ఈ పీ4 మోడల్. జులైలో ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు ఈ విధానం గురించి ప్రతిపాదించారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే ఇదే మార్గమని సూచించారు. పీ4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్ అని అర్థం. అంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటుగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడమే ఈ పీ4 ఉద్దేశం. దేశంలో ఇప్పటి వరకూ ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్య విధానం ఉండగా.. అందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనేదే సీఎం చంద్రబాబు ఆలోచన.
ఇక పీ4 విధానంలో భాగంగా సామాజిక బాధ్యత కింద దేశంలోని తొలి పదిశాతం సంపన్న వర్గాలు.. అట్టడుగున ఉన్న 20 శాతం మందిని దత్తత తీసుకుని.. వారి ఉన్నతికి తోడ్పడాలని చంద్రబాబు నీతి అయోగ్ సమావేశంలో సూచించారు. దేశంలో సంపద సృష్టి జరుగుతున్నా.. అది కొందరి చేతుల్లోనే ఉండిపోతోందన్న నారా చంద్రబాబు నాయుడు.. ఈ పీ4 విధానం అమలు చేస్తే అట్టడుగు వర్గాలు అభ్యున్నతి చెందుతాయని అభిప్రాయపడ్డారు. ఫలితంగా పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు. ఏపీలోనూ ఈ విధానం తెస్తామని జులైలోనే చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు వచ్చే సంక్రాంతి నుంచి పీ4 కార్యక్రమం ప్రారంభిస్తామని ఇవాళ వెల్లడించారు.