ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల పదో తేదీన భేటీ కానున్నట్లు తెలిసింది. సచివాలయం వేదికగా అక్టోబర్ 10న ఏపీ కేబినెట్ భేటీ జరగనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలుసార్లు భేటీ అయిన ఏపీ మంత్రివర్గం.. కీలక నిర్ణయాలకు, హామీల అమలుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా దసరా పండుగకు కేవలం రెండు రోజుల ముందు ఏపీ మంత్రివర్గ భేటీ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ పథకం ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. దీనిపై చంద్రబాబు నాయుడు కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్ను వసూలు రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే ఆవకాశాలు ఉన్నాయి. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయిల ఏర్పాటుపైనా చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రాజెక్టులు అయిన పోలవరం నిర్మాణం, అమరావతి రాజధానిపైనా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటుగా దసరా కానుకగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ప్రారంభిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. దీనిపైనా చర్చించే అవకాశం ఉంది.
ఇక ఆడబిడ్డ నిధి కింద మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1500 జమ చేయటం, తల్లికి వందనం పథకం అమలుపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం అమలుపైనా మంత్రులతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి ఈ పథకాన్ని ఏపీలో అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పీఎం కిసాన్ యోజన నిధులను కేంద్రం విడుదల చేసే ఛాన్స్ ఉంది. దీంతో అన్నదాత సుఖీభవ అమలుకు విధివిధానాలపై ఏపీ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.