ఆంధ్రప్రదేశ్‌ను మత్తురహితం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. వీధులను, విద్యా సంస్థలను కమ్మేసిన ఈ రక్కసిని అంతం చేసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల పోలీసులు నడుం బిగించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దాని మూలాలపై దాడులు చేస్తున్నారు. గత ఆరు వారాల్లో పలు అంతర్రాష్ట్ర ముఠాలు పట్టుబడ్డాయి. ఒడిశా నుంచి తమిళనాడుకు.. మల్కన్‌గిరి నుంచి మధ్యప్రదేశ్‌కు.. విశాఖ మన్యం సరిహద్దుల నుంచి తెలంగాణకు తరలిస్తున్న వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యూహం ప్రకారం గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆగస్టు 17న విశాఖపట్నంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలతో సమావేశమయ్యారు.
గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర, రాష్ట్రేతర గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో 27 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి డైనమిక్ వాహనాలు అందజేశారు. 14 వ్యూహాత్మక చెక్ పోస్టులు, 34 హాట్ స్పాట్‌లు, ప్రత్యేక ఎన్‌డీపీఎస్ బీట్లు ఏర్పాటు చేసి గంజాయి స్మగ్లింగ్ అరికట్టేందుకు అధునాతన టెక్నాలజీ వినియోగంతో పాటు లారీలు, కంటైనర్లలో దాచిన గంజాయి పసిగట్టేందుకు పోలీసు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి రంగంలోకి దించారు. సీసీ కెమెరాలు కూడా బిగించారు. కింగ్ పిన్‌ల కదలికలపై నిఘా పెట్టి అనుమానితులపై సస్పెక్ట్ షీట్లు తెరిచి ప్రజల్లో అవగాహన పెంచి మూలాల నుంచే గంజాయి మహమ్మారిని నిర్వీర్యం చేసేందుకు ఐదు జిల్లాల ఎస్పీలతో మూకుమ్మడి వ్యూహ రచన చేశారు. యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ సెల్‌లు గంజాయి స్మగ్లర్ల కదలికలపై నిఘా పెట్టి గస్తీ తిరుగుతున్నాయి.