ఇప్పటికే ముడా కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేసిన పనికి కర్ణాటక సీఎం తీవ్ర విమర్శల పాలవుతున్నారు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించేందుకు వచ్చిన సీఎం సిద్ధరామయ్య షూలు విప్పేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్త.. కిందికి వంగి.. ముఖ్యమంత్రి షూ లేస్‌లు విప్పారు. అంతటి వరకు బాగానే ఉన్నా ఆ సమయంలో ఆ కాంగ్రెస్ కార్యకర్త చేతిలో జాతీయ జెండా ఉంది. జాతీయ జెండాను పట్టుకున్న వ్యక్తితో సిద్ధరామయ్య బూట్లు విప్పించుకున్నారని ప్రస్తుతం తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
గాంధీ జయంతి సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సీఎం సిద్ధరామయ్య.. ప్రస్తుతం తీవ్ర విమర్శల పాలవుతున్నారు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించేందుకు వచ్చిన సిద్ధరామయ్య షూలు వేసుకుని ఉన్నారు. అయితే షూలు తీసి నివాళులు అర్పించేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. వెంటనే కిందికి వంగి.. సిద్ధరామయ్య వేసుకున్న షూలకు ఉన్న లేస్‌లను విప్పాడు. అయితే అప్పుడు ఆ కార్యకర్త చేతిలో జాతీయ జెండా ఉండటమే ప్రస్తుత విమర్శలకు కారణం అవుతోంది.
జాతీయ జెండా పట్టుకున్న ఆ కార్యకర్త.. సీఎం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఆయన వేసుకున్న షూల లేస్‌లు విప్పాడు. అయితే ఆ ఉత్సాహంలో చేతిలో జాతీయ జెండా ఉందన్న విషయాన్నే మర్చిపోయాడు. చేతిలో జాతీయ జెండా ఉండగానే షూలు విప్పడం అది కాస్తా కెమెరా కంటికి చిక్కడంతో ఆ వీడియో మొత్తం ఇప్పుడు బయటికి వచ్చింది. దాన్ని కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జెండా పట్టుకుని ఆ కార్యకర్త సీఎం షూలు విప్పుతుండటాన్ని గమనించిన మరో కార్యకర్త వెంటనే కిందికి వంగి.. ఆ వ్యక్తి చేతిలో ఉన్న జాతీయ జెండాను తీసుకున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి షూలు విప్పే పనిని పూర్తి చేశాడు.
అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సీఎం సిద్ధరామయ్యపై నెటిజన్లు, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కార్యకర్త అత్యుత్సాహంతో ప్రదర్శించినా.. ముఖ్యమంత్రి అడ్డుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కార్యకర్త చేతిలో జాతీయ జెండా ఉన్న విషయాన్ని సిద్ధరామయ్య గుర్తించినా.. ఎందుకు వద్దని వారించలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.