దేశంలో నిత్యం ఏదో ఓ మూల.. మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుండగా.. నిందితులకు శిక్షలు కూడా పడుతున్నాయి. అంతేకాకుండా మహిళలపై జరుగుతున్న ఈ అకృత్యాలకు వ్యతిరేకంగా ఎన్నో నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయినా కొందరు మృగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా దొంగతనం కోసం వెళ్లిన కొందరు దుండగులు.. దోచుకున్న తర్వాత.. ఆ ఇంటి యజమానిపై సామూహిక అత్యాచారం చేశారు. ఒడిశాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. నగరంలోని మైత్రి విహార్‌లో ఓ 27 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కుమార్తెతో నివాసం ఉంటోంది. గత నెల 30వ తేదీన తెల్లవారుజామున 2 గంటలకు ఆమె ఉండే అపార్ట్‌మెంట్‌లోకి కొందరు ఆగంతకులు చొరబడ్డారు. అనంతరం ఆ మహిళకు కత్తి చూపించి బెదిరించి.. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత డబ్బులు, బంగారం, ఇతర ఆభరణాలు కూడా చోరీ చేశారు. అయితే అంతటితో ఆగని ఆ దుండగులు.. ఆ మహిళపై కన్నేశారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించారు.
దుండగులను ఆమె నిలువరించింది. అయితే పక్కనే ఉన్న ఆమె 2 ఏళ్ల కుమార్తెను చంపేస్తామని బెదిరించిన ఆ ఆగంతకులు.. ఆమెను లొంగదీసుకుని.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుమార్తె ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆ మహిళ.. వారి ముందు లొంగిపోయింది. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఆ దారుణం నుంచి తేరుకున్న తర్వాత ఆ మహిళ.. దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
బాధిత మహిళ స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ మహిళ 10 రోజుల క్రితమే ఆ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చినట్లు వెల్లడించారు. వెదురు కర్రల సాయంతో దొంగలు ఆ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ అపార్ట్‌మెంట్ వద్ద సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను పట్టుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీలను పరిశీలించి.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.