ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం పెట్టారు. పవన్ చిన్న కుమార్తె పొలెనా కొణిదెల కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే పొలెనా తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.
ఇటీవల జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్‌పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అన్య మతస్తుడైన జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయకపోతే ఆలయంలోకి అనుమతించరాదంటూ హిందూ సంఘాలు, కూటమి పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో జగన్ ఏకంగా తిరుమల పర్యటననే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ వివాదం వేళ పవన్ కళ్యాణ్ తన కూతురితో డిక్లరేషన్‌పై సంతకం చేయించడం, తండ్రిగా తానూ సంతకం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష ముగింపు కోసం పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకున్నారు.. ఇవాళ శ్రీవారిని దర్శించుకుని, ఆ తర్వాత దీక్ష విరమించనున్నారు. పవన్ రెండ్రోజుల పాటు కొండపైనే బస చేయనున్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్ష విరమించి అన్న ప్రసాదం, లడ్డూ తయారీ ప్రక్రియలను పరిశీలించనున్నారు. లడ్డూ నాణ్యత, టీటీడీ అందిస్తోన్న సేవలపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
అంతకముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. అక్కడి నుంచి అలిపిరి మెట్లమార్గం నుంచి కాలినడకన తిరుమలకు బయల్దేరారు.. మార్గమధ్యంలో భక్తులతో మాట్లాడుతూ.. సేద తీరుతూ తిరుమలకు చేరుకున్నారు. మహావిష్ణువు, తుంబురుడికి నమస్కరించి శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. మార్గ మధ్యలోనే ఏడోమైలు వద్ద రాష్ట్ర సీసీఎఫ్ నాగేశ్వరరావుతో పవన్ కళ్యాణ్ కొద్దిసేపు మాట్లాడారు. గతేడాది చిరుత దాడిలో చనిపోయిన లక్షిత, గాయపడిన బాలుడి వివరాలను, అనంతరం చేపట్టిన రక్షణ ఏర్పాట్లను సీసీఎఫ్ పవన్ కళ్యాణ్‌కు వివరించారు. పవన్ కళ్యాణ్ నడిచే సమయంలో కొంత ఇబ్బందిపడగా.. వైద్యులు కొంతసేపు ఆయన కాలికి ఫిజియోథెరపీ చేశారు. అనంతరం ఆ తర్వాత జీఎన్‌సీ దగ్గర సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ మూడంచెల భద్రత కల్పించారు.. పవన్ తిరుమలకు వచ్చే సమయంలో నడకమార్గంలో మూడంచెల స్పెషల్ రోప్‌పార్టీల భద్రత కల్పించారు. మొదట ఆర్మ్‌డ్, రెండోదశలో ఎస్టీఎఫ్, మూడోదశలో సివిల్ పోలీసులతో రక్షణ ఏర్పాటు చేశారు.