ఆం ధ్రప్రదేశ్‌లో లులు ప్రాజెక్టుపై మరోసారి చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోగా.. తాజాగా లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని చెప్పారు. అయితే గత ప్రభుత్వం లులును వెళ్లగొట్టిందనే విమర్శలు రావడంతో.. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లులు గ్రూపు వెళ్లిపోవడానికి కారణాలను చెప్పారు.
విశాఖలో లులు ప్రాజెక్టును తమ ప్రభుత్వ హయాంలో.. తామే వద్దన్నామన్నట్లు బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. లులు సంస్థ రూ.600 కోట్లు పెట్టుబడి పెడితే.. ఆ సంస్థకు రూ.1,200 కోట్ల విలువైన భూమిని అప్పగించడం సరికాదన్నారు. లులు పెట్టుబడి స్థలం విలువలో సగం కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అందుకే తాము ఆ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు చెప్పారు. లులుకు ప్రత్యామ్నాయంగా పోర్టు ఆస్పత్రి పక్కన ఇనార్బిట్ మాల్‌ను తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో లులు ప్రతినిధులు కలిస్తే ఎందుకు పెద్ద హడావిడి చేస్తున్నారని ప్రశ్నించారు బొత్స.
విశాఖ స్లీల్ ప్లాంట్‌లోని కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించడానికి వీల్లేదన్నారు బొత్స సత్యనారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రగా వ్యాఖ్యానించారు. అందుకే స్టీల్ ప్లాంట్‌లో 3,725 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ.. వారికిచ్చిన కార్డులను రద్దు చేస్తామనడి సరికాదన్నారు. ఒక్క కార్మికుణ్ని తొలగించినా ఊరుకునేది లేదని.. కార్మికుల ఉద్యోగాలు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయాలని.. స్టీల్ ప్లాంట్‌లో పరిణామాలు గమనిస్తే ఒక ప్రణాళిక ప్రకారం జరుగతోందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు సీఎం, డిప్యూటీ సీఎం కట్టుబడి ఉండాలని కోరారు.
కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఉన్న వాళ్లను తొలగిస్తోందని ఆరోపించారు బొత్స. అలాగే రాష్ట్రంలో వాలంటీర్లను సైతం తొలగించే ప్రయత్నం జరుగతోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తున్నారని.. నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాల్లో లులు గ్రూప్ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి సీఎం చంద్రబాబుని కలిసి విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికలు రావడం.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పరిణామాలతో లులు గ్రూప్ ఏపీ నుంచి వెళ్లిపోయింది. కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. లులు గ్రూప్ ఛైర్మన్ అలీ గతవారం చంద్రబాబును కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పారు.