దేశంలో నైరుతి రుతుపవనాలు కాలం సోమవారంతో ముగిసిందని, ఈ ఏడాది సీజన్‌లో అంచనాలకు మించి దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. అలాగే, నైరుతి ముగిసి ఈశాన్య రుతుపవనాల సీజన్ మొదలైనట్టు ప్రకటించింది. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య ఈ మూడు నెలల ఈశాన్య రుతుపవనాల కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా మధ్య భారతం, దక్షిణ భారతం సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు పుష్కలంగా కురుస్తాయని పేర్కొంది. అయితే, అక్టోబరు నెలలో మధ్య, దక్షిణ భారతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది.
ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ.. తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక దక్షిణ ప్రాంతాలు సహా, మధ్య భారతంలో సాధారణాన్ని మించి (112 శాతం) వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే, వాయవ్య, ఈశాన్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. అయితే, నైరుతి రుతుపవన కాలంలో దేశంలో సాధారణాన్ని మించి 7.6 శాతం అధిక వర్షపాతం నమోదైందని మహాపాత్ర వెల్లడించారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో అధిక వర్షాలు కురిశాయని చెప్పారు..
ప్రస్తుతం, ఎల్ నినో తటస్థ పరిస్థితులు ఉన్నాయన్న మహాపాత్ర.. రుతుపవనాల అనంతర కాలంలో లా నినా పరిస్థితులు అభివృద్ధి చెందడానికి అధిక అవకాశాలను సూచిస్తున్నాయని చెప్పారు. నైరుతి రుతపవనాల సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షాలు కురువడంతో ఖరీఫ్ పంటలకు మేలు జరగడమే కాదు.. రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో మొత్తం 934.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సాధారణ వర్షపాతం 868.6 మిల్లీమీటర్లతో పోల్చితే ఇది అధికం.
వాయువ్య భారతం (7 శాతం), మధ్య భారతం (19.5 శాతం), దక్షిణ భారతంలో (13.09 శాతం) సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యింది. కానీ, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే కురిసింది. దేశవ్యాప్తంగా ఉన్న 724 జిల్లాల్లో 78 శాతం జిల్లాలు సగటు, లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం.. మిగిలిన 150 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదయినట్టు ఐఎండీ పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రారంభమైన జూన్‌లో దేశవ్యాప్తంగా లోటు వర్షపాతం ఉన్నా.. జులై, ఆగస్టు, సెప్టెంబరులో మాత్రం సాధారణానికి మించి వర్షపాతం నమోదయినట్టు ఐఎండీ డైరెక్టర్ తెలిపారు.