ఉత్తర్ ప్రదేశ్‌లోని కొన్ని చోట్ల ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. వారణాసిలో బడా గణేశ్, పురుషోత్తమ తదితర పది ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించారు. ‘సనాతన్ రక్షక్ దళ్’ చేపట్టిన ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి నుంచి ఈ చర్యకు దిగారు. బడా గణేశ్ ఆలయ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం సనాతన్ రక్షక్ దళ్ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం అక్కడ సాయిబాబా విగ్రహాన్ని ఆలయం నుంచి బయటకు తీసి ప్రాంగణం వెలుపల పెట్టారు. సరైన అవగాహన లేకుండా సాయిబాబాను ఆరాధిస్తున్నామని.. వాస్తవానికి శాస్త్రాల్లో బాబా ఆరాధన గురించి ఎక్కడా చెప్పలేదని బడా గణేశ్ ఆలయ ప్రధాన పూజారి, సనాతన్ రక్షక్ దళ్ సభ్యుడు రాము గురు అన్నారు.
అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయ మహంతు రాజుదాస్ సైతం ఈ చర్యను సమర్థించడం గమనార్హం. సాయిబాబా ధర్మ గురువే కావచ్చు, కానీ దైవం కాదని ఆయన అన్నారు. ‘సాయిబాబా ధర్మగురువు.. మహాపురుషుడు.. పండితుడు కావచ్చు కానీ భగవంతుడు కాదు.. సాయిబాబా విగ్రహాన్ని ఆలయం నుంచి తీసేసి వారణాసి వ్యక్తికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను.. దేశంలోని సనాతనులంతా సాయిబాబా విగ్రహాలను ఆలయాల నుంచి తొలగించాలి’ అని పిలుపునిచ్చారు. కాగా, వారణాసి అన్నపూర్ణ ఆలయం ప్రధాన పూజారి శంకర్ పూరి సైతం.. శాస్త్రాల్లో సాయిబాబా ఆరాధన గురించి ప్రస్తావన లేదని వ్యాఖ్యానించారు.
వారణాసిలో ఆది దేవుడైన పరమేశ్వరుడి ఆరాధన మాత్రమే జరగాలని దళ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌శర్మ పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించి పది ఆలయాల్లోని సాయిబాబా విగ్రహాలను తొలగించామని, రాబోయే రోజుల్లో అగస్త్యకుండ, భుటేశ్వర్ ఆలయంలో విగ్రహాలను తొలగిస్తామని చెప్పారు. అయితే, వారణాసిలోని సంత్ రఘువర్ దాస్ నగర్‌లోని సాయిబాబా ఆలయ పూజారి సమర్ ఘోష్ దీనిపై స్పందించారు. ‘ఈరోజు సనాతనులమని చెప్పుకుంటున్నవారే గతంలో ఈ ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను ప్రతిష్ఠించారు.. ఇది సరైన చర్య కాదు’ పేర్కొన్నారు. తమ ఆలయానికి భక్తులు రోజు వస్తారని, గురువారాల్లో 4 నుంచి 5 వేల మంది దర్శించుకుంటారని ఆయన తెలిపారు.
కాగా, ఈ చర్యల వెనుక బీజేపీ ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సాయిబాబా విగ్రహాలను ఆలయాల నుంచి తొలగించడం చాలా బాధకరమైన సంఘటన అని భక్తులు వాపోతున్నారు. ‘దేవుళ్లంతా ఒక్కటేనని, తమ నమ్మకాన్ని బట్టి పూజించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది..సాయిబాబా హిందువా లేదా ముస్లిమా అనే విషయానికి వస్తే, ఆ విభజనలను సృష్టించింది మనమే. దేవుడు మనుషుల మధ్య భేదాలు పెట్టడు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబాను భగవంతుని అవతారంగా అన్ని మతాలవారు పూజిస్తారని శిర్డీలోని శ్రీ సాయిబాబా సనాతన్ ట్రస్టు తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య.. సాయిబాబా ఆరాధనపై చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకోవడానికి 2014లో సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని హిందూ ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖకు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.