టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్ కూలి.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ముగ్గురు మృతిచెందినట్టు పింప్రి-చించివాడ్ పోలీసులు తెలిపారు. ఇద్దరు పైలట్ల, ఓ ఇంజినీర్‌తో బయలుదేరిన హెలికాప్టర్ బుధవారం ఉదయం 6.45 గంటల సమయంలో బవధన్ ప్రాంతంలో కూలిపోయినట్టు పేర్కొన్నారు. అయితే, ఈ హెలికాప్టర్ ప్రభుత్వానిదా? ప్రయివేట్ వ్యక్తులదా? అనేది మాత్రం తెలియరాలేదు.
‘పుణే జిల్లా బవధన్ ప్రాంతంలో ఓ హెలీకాప్టర్ ప్రమాదానికి గురయ్యింది.. కొండ ప్రాంతంలో కూలిపోయింది.. ప్రాథమిక సమాచారం ప్రకారం అందులోని ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.. ఆ లోహవిహంగం ఎవరిది? అనేది తెలియాల్సి ఉంది’ అని సీనియర్ ఇన్‌స్పెక్టర్ కన్హియా థోరట్ చెప్పారు. కాగా, స్థానిక ఆక్స్‌ఫర్డ్ గోల్ఫ్ క్లబ్‌లోని హెలీపాడ్ నుంచి హెలికాప్టర్ బయలుదేరినట్టు మీడియా కథనాలు పేర్కొన్నారు. పొగ మంచు వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. విపరీతంగా మంచు కురువడం వల్ల మార్గం కనిపించకపోవడంతో కూలిపోయినట్టు తెలుస్తోంది.
హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. మంటల్లో ముగ్గురూ సజీవదహనమైట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
‘మేము ఘటనా స్థలికి చేరుకునేసరికి కూలిపోయిన హెలికాప్టర్ కాలిపోతోంది. చుట్టూ దట్టమైన మంటల వ్యాపించి ఎగిసిపడుతున్నాయి..మంటలను అదుపుచేసి.. అందులో ఉన్న మూడు మృతదేహాలను వెలికితీసి పోలీసులకు అప్పగించాం... ప్రమాదం గురించి విచారణ జరుగుతోంది’ అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ దేవంద్ర ప్రభాకర్ పాట్‌ఫోడే అన్నారు. కాగా, ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ హెలికాప్టర్‌ను పుణేలోని హెరిటేజ్ ఏవియేషన్ సంస్థకు చెందిందిగా గుర్తించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఛాపర్‌ని అద్దెకు తీసుకుందని, ఇది ముంబైకి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని సమాచారం. ఎన్సీపీ అధినేత సునీల్ తట్కరే తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన హెలికాప్టర్‌లో రాయగడ పర్యటనకు వెళ్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.