రాయలసీమ వరప్రదాయిని హంద్రీ-నీవా సుజల స్రవంతి సామర్థ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. మొదటి దశలో సామర్థ్యం పెంచడం.. ప్రధాన కాలువ విస్తరణ, లైనింగ్ పనులు చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకుల తొలగింపుపైనా దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు.
బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రాధాన్య ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వంలోనే కీలక పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులు వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి చెప్పారు. కృష్ణాజలాలను ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల వరకూ తరలించే ఉద్దేశంతో 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించాం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన ఇరవై శాతం పనులను జగన్ ప్రభుత్వం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది. దీంతో సీమ జిల్లాలకు కృష్ణా జలాలు అందించలేకపోతున్నాం. హంద్రీ-నీవా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. ఎత్తిపోతల పథకాలపైనా దృష్టిసారించాల్సి ఉంది. చివరి ఆయకట్టుదాకా సాగునీటిని తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాలి’ అని స్పష్టం చేశారు. రామానాయుడు గతవారం కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. హంద్రీ-నీవా ప్రధాన కాలువ, రిజర్వాయర్లు, పుంగనూరు బ్రాంచి కెనాల్, కుప్పం బ్రాంచి కెనాల్‌ను పరిశీలించారు. ఆ సందర్భంగా తన దృష్టికి వచ్చిన అంశాలపై అధికారులతో సమీక్షించారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు సాగు, తాగునీరందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు గత టీడీపీ ప్రభుత్వంలోనే 70 శాతం పూర్తయ్యాయని గుర్తుచేశారు. వైసీపీ పాలనలో పనులేవీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ పథకాన్ని ప్రాధాన్యతా ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలని, పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రధాన అడ్డంకి భూసేకరణను పూర్తి చేయడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు-ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.