సనాతన ధర్మ పరిరక్షణ కోసమే వారాహి యాత్ర చేపడుతున్నట్టు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘సుమారు 14 నెలల క్రితం వారాహి మొదటిసారి రోడ్డుపైకి వచ్చినపుడు అది కేవలం ఉద్యమం మాత్రమే కాదు దానికంటే మించిన కార్యక్రమం. కార్యాచరణకు పిలుపు. వైసీపీ నిరంకుశ పాలనలో ఏపీ నలిగిపోతున్న ఆ సమయంలో వారాహి శక్తికి సంకేతంగా మారింది. ఇపుడు వారాహి చాలా పెద్ద లక్ష్యం కోసం తిరిగి వచ్చింది.
సనాతన ధర్మ రక్ష బోర్డుకు జీవం పోయాలనుకునే లక్షలాది మంది స్వరాన్ని ప్రతిధ్వనించడమే దాని లక్ష్యం. మన ప్రాచీన సాంప్రదాయాలు, విలువలను పరిరక్షించడానికి సంబంధించింది. రేపటి వారాహి సభ ఈ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. తిరుపతిలో నేను వారాహి డిక్లరేషన్ చేయబోతున్నా. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని, మన వారసత్వాన్ని కాపాడుకుంటానని, ఆ లక్ష్యం కలిగిన ప్రతి ఒక్కరితో కలసి నడుస్తానని వాగ్ధానం చేస్తున్నాను. కలసికట్టుగా దేశ భవిష్యత్తును సురక్షితం చేయడంతో పాటు బలోపేతం చేయగలం’ అని పవన్ పోస్టు చేశారు.