సనాతన ధర్మానికి భంగం కలిగితే తాను బయటికి వచ్చి పోరాడతానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని, డిప్యూటీ సీఎం పదవి పోయినా భయపడబోనని, ధర్మాన్ని రక్షించడం కోసం దేనికైనా సిద్ధమేనని అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పవన్ ప్రసంగించారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పై పరోక్షంగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన తమిళంలోనూ, ఆంగ్లంలోనూ ప్రసంగించారు "సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు...ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలకుంటే, వారే తుడిచిపెట్టుకుని పోతారు... తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా" అంటూ పవన్ హెచ్చరించారు. ఇక, సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులను న్యాయస్థానాలు సమర్థిస్తున్నాయని, సనాతన ధర్మంపై దాడులు చేస్తున్న వారిని కోర్టులు కాపాడుతుండడం బాధాకరమని వ్యాఖ్యానించారు.