తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వాగతించారు. తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది. ఈ అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయడం వల్ల వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఈ కేసు విచారణకు సిట్ ఒక్కటే సరిపోదు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలి. సెంట్రల్ నుంచి సూపర్ విజన్ ఉండాలని తెలిపారు. తిరుమల లడ్డూ వివాదంపై కేసును సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘ఈ అంశంపై పొలిటికల్ డ్రామా జరగొద్దనుకుంటున్నాం. సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు.కల్తీ జరిగిందని మీరు ఊహించుకుంటున్నారా? కల్తీ నెయ్యి కేసు సీబీఐకి ఎందుకు దర్యాప్తు చేపట్టకూడదు’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించినట్లు అంబటి రాంబాబు తెలిపారు. స్వతంత్ర దర్యాప్తు ఉంటే మంచిది. సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఇద్దరు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు ఉంటారని చెప్పారు. ఈ క్రమంలోనే సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు చేపడుతారని తెలిపారు. సిట్ సభ్యులుగా ఇద్దరు సీబీఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, FSSAI(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్‌ఇండియా) నుంచి ఒకరు దర్యాప్తు చేపట్టనున్నారు.